Covid Crisis: ఉత్తరకొరియాలో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజే 2.7 లక్షల మందికి జ్వరాలు

ఉత్తర కొరియాలో కరోనా విశ్వరూరం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. నిత్యం లక్షలమందిలో జ్వరాలు వెలుగు చూస్తున్నాయి.

Published : 18 May 2022 01:43 IST

14లక్షల మందిలో కొవిడ్‌ లక్షణాలు.. 56 మంది మృతి

సియోల్‌: ఉత్తర కొరియాలో కరోనా విశ్వరూపం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. నిత్యం లక్షలమందిలో జ్వరాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లోనే 2లక్షల 69వేల మంది జ్వరం బారినపడినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. మరో ఆరుగురు మృత్యువాత పడడంతో కొవిడ్‌ లక్షణాలతో మరణించిన వారిసంఖ్య 56కు చేరినట్లు తెలిపింది. ప్రజలందరికీ కొవిడ్‌ నిర్ధారణ చేయనప్పటికీ అవన్నీ కొవిడ్‌ అనుమానిత కేసులుగానే భావిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కిమ్‌.. సైన్యాన్ని రంగంలోకి దించి బాధితులకు ఔషధాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

రెండున్నరేళ్లపాటు కరోనా వైరస్‌ను దరిచేరనివ్వని ఉత్తర కొరియాలో గత కొన్ని రోజులుగా వైరస్‌ విజృంభణ మొదలుపెట్టింది. నిత్యం రెండు, మూడు లక్షల మంది జ్వరం బారినపడుతున్నట్లు అక్కడి అధికారిక మీడియా పేర్కొంది. అయితే, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసే కిట్‌లు లేకపోవడంతో లక్షణాలున్న వారిని ఇళ్లకే పరిమితమై జాగ్రత్తగా ఉండమని సూచిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 14లక్షల మంది జ్వరం బారినపడగా వారిలో ప్రస్తుతం 6.6 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 24 గంటల పాటు మిలటరీ అందుబాటులో ఉంచి ప్రజలకు అవసరమైన ఔషధాలను అందిస్తున్నట్లు తెలిపింది.

కొవిడ్‌ను ఎదుర్కొనే వ్యవస్థ శూన్యం..

2.6కోట్ల జనాభా కలిగిన ఉత్తర కొరియాలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యవస్థలు శూన్యమనే చెప్పవచ్చు. పేదరికం, పోషకాహార లోపం, ప్రజారోగ్య సదుపాయాల లేమి, సరైన ఔషధాలు లేని ఉత్తర కొరియాలో కరోనా వ్యాక్సిన్‌ అనే మాటే లేదు. ఇప్పటివరకు అక్కడ కనీసం ఒక్కరికైనా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కరోనా మరణాలపై వాస్తవాలను వెల్లడించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా తీవ్ర వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఉపద్రవమేనన్న కిమ్‌..

దేశంలో ఊహించని విధంగా విరుచుకుపడిన కరోనా వైరస్‌ ఉద్ధృతిపై స్పందించిన ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. భారీ ఉపద్రవం ముంచుకొచ్చిందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఓవైపు లక్షల మంది కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రజలను హెచ్చరిస్తూనే వ్యవసాయ, పారిశ్రామిక, నిర్మాణ రంగంలో పనిచేసుకోవచ్చని సూచించారు. మరోవైపు ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రజలు శుభ్రత పాటించాలని పేర్కొంటూ అధికారిక మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు చెబుతూనే కొవిడ్‌ ఉద్ధృతిపై వైద్యనిపుణులతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ తరుణంలో ఉత్తర కొరియాకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పలు దేశాలు ముందుకు వచ్చినప్పటికీ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని