North Korea: విదేశీ వస్తువులను తాకడం వల్లే.. మా దేశంలో కరోనా..!

తన దేశంలో కొవిడ్ వ్యాప్తికి విదేశీ వస్తువులు కారణమంటూ దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా నిందలు వేసింది.

Published : 01 Jul 2022 14:07 IST

దక్షిణ కొరియాపై నిందలు వేసిన ఉత్తర కొరియా

ప్యాంగ్యాంగ్‌: తమ దేశంలో కొవిడ్(Covid-19) వ్యాప్తికి విదేశీ వస్తువులు కారణమంటూ దక్షిణ కొరియా(South Korea)పై ఉత్తర కొరియా(North Korea) నిందలు వేసింది. విదేశీ వస్తువులు తాకడం వల్లే తమవద్ద మొదటిసారి కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైందని ఆరోపించింది. తమ ఆరోపణలు నిరూపించే విధంగా దర్యాప్తు వివరాలను ప్రకటించింది. ‘ఉత్తర కొరియా ప్రజలు సరిహద్దుల వెంట గాలి, వాతావరణం, బెలూన్ల ద్వారా వచ్చే విదేశీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించింది.

దేశ ఆగ్నేయ ప్రాంతంలో కుమ్‌గాంగ్ పర్వత ప్రాంతంలోని ప్రజలు గుర్తుతెలియని వస్తువులను తాకడం వల్ల 18 ఏళ్ల సైనికుడు, ఐదేళ్ల చిన్నారికి జ్వరం లక్షణాలు కనిపించాయని పేర్కొంది. ఆ తర్వాత వారికి కరోనా పాజిటివ్‌గా తేలిందని తెలిపింది. అక్కడి ఇఫోరి ప్రాంతం నుంచి ఏప్రిల్ మధ్యలో రాజధానికి వచ్చిన అనేక మందిలో జ్వరం ఉన్నట్లు గుర్తించామని, వారి రాకపోకలతో దేశంలో అనూహ్యంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. అయితే ఏప్రిల్ మధ్య వరకు దేశంలో వచ్చిన జ్వరాలకు ఇతర వ్యాధులు కారణమని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. అయితే అవేంటో మాత్రం వివరించలేదు.

ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా ఫిరాయింపుదారులు, కార్యకర్తలు రెండు దేశాల సరిహద్దుల వెంబడి దశాబ్దాలుగా బెలూన్లు ఎగరవేస్తుంటారు. వాటి ద్వారా కరపత్రాలు, మానవతా సహాయాన్ని అందిస్తుంటారు. అయితే భద్రతా కారణాలతో దక్షిణ కొరియా మునుపటి ప్రభుత్వం ఈ చర్యలపై నిషేధం విధించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బెలూన్ల ఎగరవేత కార్యకలాపాలు మళ్లీ అడపాదడపా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విమర్శలు వచ్చాయి.

కరోనాను కట్టడి చేసే లక్ష్యంతో 2020 నుంచి ఉత్తర కొరియా సరిహద్దు వద్ద కఠిన ఆంక్షలు అమలు చేసింది. రెండేళ్ల పాటు ఒక్క కేసూ రాలేదన్న ఆ దేశం.. ఈ మేలో మొదటి కేసు గురించి ప్రకటించింది. తమ దేశంలో మిస్టరీ జ్వరాలు వ్యాపిస్తున్నాయని పేర్కొంది. వైద్య సదుపాయాలు, తగిన టెస్టింగ్‌ కిట్లు లేకపోవడంతో ఆ జ్వరం కొవిడ్ అని గుర్తించడం సాధ్యం కావడం లేదని నిపుణులు వెల్లడించారు. కొవిడ్‌ కేసుల్నే ఉత్తర కొరియా జ్వరాలుగా ప్రకటిస్తుందన్నారు. ఇప్పటివరకూ ఆ దేశంలో 4.74 మిలియన్ల ప్రజలు జ్వరం బారినపడ్డారు. ఇదిలా ఉండగా.. యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ప్రజలు కలుషితమైన ఉపరితలాలు లేక వస్తువులను తాకడం ద్వారా కరోనా బారినపడే ప్రమాదం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయితే ఆ వ్యాప్తి అసాధ్యమని మాత్రం చెప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు