North korea: కిమ్మా.. మజాకానా? లాక్‌డౌన్‌లోకి ఉత్తర కొరియా నగరం!

ఉత్తర కొరియా (North Korea)లోని ఓ నగరంలో మాత్రం మరోసారి లాక్‌డౌన్‌ (Lockdown) విధించారు. అలాగని అక్కడ కొవిడ్‌ కేసులు మళ్లీ విజృంభించాయనుకుంటే పొరపాటే. సైనికుల చేసిన పనివల్ల రెండు లక్షల మంది జనాభా ఉన్న నగరం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది.

Published : 29 Mar 2023 01:33 IST

ప్యాంగాంగ్‌: కరోనా సమయంలో చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ (Lockdown) విధించడం చూశాం. దాదాపు ఇప్పుడు అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులే నెలకొన్నాయి. కానీ, ఉత్తర కొరియా (North Korea)లోని ఓ నగరంలో మాత్రం మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. అలాగని అక్కడ కొవిడ్‌ కేసులు మళ్లీ విజృంభించాయనుకుంటే పొరపాటే. అయితే, ఈసారి లాక్‌డౌన్‌ విధించడానికి కారణం తుపాకీ తూటాలట( Bullets)! ఔను.. మీరు విన్నది నిజమే తాజా లాక్‌డౌన్‌కు తూటాలే కారణం. సైనికులు పోగొట్టుకున్న తూటాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉత్తర కొరియాలోని హైసన్‌ (Hyesan) నగరంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. 

ఉత్తర కొరియా సరిహద్దు నగరమైన హైసన్‌లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 10 మధ్య సైనిక దళాల ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో మార్చి 7న సైనికుల వద్ద నుంచి దాదాపు 653 తూటాలు మాయమయ్యాయి. సైనికులు అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాటిని కనుగొనే ప్రయత్నం చేసినప్పటికీ అవి దొరకలేదు. దీంతో పైఅధికారులకు సమాచారం ఇవ్వగా.. తూటాలు దొరికే వరకు హైసన్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించాలని అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un)  ఆదేశించారు. ఈ నిర్ణయంతో రెండు లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరంలోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అణ్వాయుధాల తయారీ ప్రక్రియను పెంచాలని కిమ్‌ ఆదేశాలు జారీ చేసిన కొద్దిరోజులకే  ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

ఉత్తర కొరియాలో ఇలాంటివి జరగడం సాధారణమే. ఇప్పటికే అక్కడి విచిత్ర చట్టాలు, నియమాలు పలుమార్లు బయటకొచ్చాయి. విదేశీ సినిమాలు వీక్షించటం, విదేశీ పాటలు వినటం, విదేశీ వ్యక్తులతో మాట్లాడటం వంటివి ఆ దేశంలో నిషిద్ధం. ఒకవేళ వారు ఆ నియమాలు పాటించకపోతే జైలు శిక్ష అనుభవించక తప్పదు. అలాగే, దేశ ప్రజలంతా ఒకే రకమైన హెయిర్‌కట్‌ చేయించుకోవాలి. అది కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే ఉండాలి. దేశ అధ్యక్షుడు కిమ్‌ సమావేశంలో నిద్రపోరాదు. ఒకవేళ ఎవరైనా నిద్రపోతే వారిని ద్రోహులుగా పరిగణించి శిక్షలు విధించిన సందర్భాలూ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని