Kim: క్షిపణి ప్రయోగానికి కిమ్ కుమార్తె.. తొలిసారి బయటి ప్రపంచంలోకి..!

జపాన్‌ ప్రాదేశిక జలాల సమీపంలోకి ఉ.కొరియా శుక్రవారం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగం వేళ.. కిమ్ కుమార్తె మొదటిసారి బయట ప్రపంచానికి కనిపించింది.

Updated : 19 Nov 2022 20:02 IST

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా దేశం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఆ దేశ నియంత కిమ్‌ జోంగ్ ఉన్‌, ఆయన కుటుంబ విషయాలు కూడా రహస్యమే. ఈ క్రమంలో కిమ్ తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు. ఖండాంతర క్షిపణి ప్రయోగానికి ముందు దానిని పరిశీలించేందుకు ఆయన తన కూతురును వెంటబెట్టుకొచ్చారు. 

థాయిలాండ్‌లో ఆసియా పసిఫిక్‌ తీర దేశాల ఆర్థిక సహకార మండలి (ఎపెక్‌) శిఖరాగ్ర సభ జరుగుతున్నవేళ ఉత్తర కొరియా దుందుడుకు చర్యకు పాల్పడింది. జపాన్‌ ప్రాదేశిక జలాల సమీపంలోకి శుక్రవారం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అణ్వస్త్రాన్ని మోస్తూ అమెరికా భూభాగాన్ని సైతం తాకగల సామర్థ్యం ఉన్న క్షిపణి అది. ఇంతవరకు పిల్లల గురించి ఏ వివరమూ చెప్పని కిమ్.. ఇలా ప్రయోగ ప్రదేశానికి కుమార్తెను తీసుకురావడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే అక్కడి మీడియా ఆ చిన్నారి పేరును మాత్రం వెల్లడించలేదు. 

‘ఒక బహిరంగ కార్యక్రమంలో కిమ్ కుమార్తెను చూసిన మొదటి సందర్భం ఇదే’ అని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడని గతంలో కొన్ని కథనాలు వెల్లడించాయి. 2013లో అమెరికన్ మాజీ బాస్కెట్ బాల్ స్టార్ డెన్నిస్ రోడ్‌మ్యాన్‌ గతంలో ఉత్తర కొరియాలో పర్యటించారు. తన పర్యటన గురించి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను కిమ్‌ కుటుంబంతో గడిపానని చెప్పారు. వారి కుమార్తె పేరు జు యె(Ju Ae) అని కూడా వెల్లడించారు. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆ బాలిక మరో నాలుగైదేళ్లలో సైన్యంలో బాధ్యతలు నిర్వహించే వయసుకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వారసత్వ బాధ్యతల నిమిత్తం ఆమెను సిద్ధం చేస్తున్నట్లుగా ప్రస్తుత పరిణామాన్ని విశ్లేషిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. కిమ్ తర్వాత ఆ దేశాన్ని పాలించేదెవరు అనే దానిపై ఆ కుటుంబం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా లేదు. ఒకవేళ కిమ్ పాలించలేని దశలో ఉంటే.. వారసుడు వచ్చే వరకు ఆయన సోదరి బాధ్యతలు చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిణామం నాలుగో తరానికి అక్కడి సమాజం సిద్ధంగా ఉండాలన్న సూచన ఇస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. కిమ్ సతీమణి కూడా చాలా అరుదుగానే బయట కనిపిస్తుంటారు. ‘ఆమె బాహ్య ప్రపంచంలోకి రావడంలో కూడా వ్యూహాత్మక సందేశం ఇమిడి ఉంటుంది. ఉద్రిక్తతలు తగ్గించడం, అంతర్గత సమస్యల సమయంలో కుటుంబం ఐక్యంగా ఉందని తెలియజేసే విధంగా ఆ సందేశం ఉంటుంది’ అని యూఎస్‌కు చెందిన లాభాపేక్ష లేని ఒక సంస్థ అంచనా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని