Published : 27 Apr 2022 01:27 IST

Kim Jong Un: ‘అణు’మానమే వద్దు.. ప్రతిదాడి ఖాయం: కిమ్‌ హెచ్చరిక

అణ్వాయుధ సంపత్తిని మరింత పెంచుకుంటామని ప్రతిజ్ఞ

సియోల్‌: తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని వీలైనంత వేగంగా బలపర్చుకుంటామని ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) అన్నారు. ఎవరైనా తమను రెచ్చగొడితే అణు బాంబులేస్తామంటూ దక్షిణ కొరియాను పరోక్షంగా హెచ్చరించారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని ప్యాంగ్యాంగ్‌లో భారీ ఎత్తున సైనిక పరేడ్‌ నిర్వహించారు. ఈ పరేడ్‌లో దేశ అత్యంత శక్తిమంతమైన, అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కిమ్‌ మాట్లాడుతూ.. ‘‘మా దేశ అణ దళాలను మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టిన చర్యలు కొనసాగుతాయి. మా అణ్వాయుధ బలగాల ప్రాథమిక లక్ష్యం (మొదటి మిషన్‌) యుద్ధాన్ని అరికట్టడమే. కానీ మా గడ్డపై అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే మాత్రం రెండో మిషన్ ‌(అణ్వాయుధ ప్రయోగం) తప్పదు. శత్రువులెవరైనా సరే.. మా ప్రాథమిక ప్రయోజనాలను ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కచ్చితంగా అనూహ్య రీతిలో స్పందిస్తాం. అప్పుడు శత్రువులు తమ అస్థిత్వాన్ని కోల్పోవాల్సిందే. మా అణు దళాలే మా జాతీయ శక్తికి సూచికలు. శత్రువును అధిగమించగల శక్తిమంతమైన ఆత్మరక్షణ సామర్థ్యం ఉంటేనే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోగలం’’ అని స్పష్టం చేశారు. ఈ పరేడ్‌లో కిమ్‌ సైనిక దుస్తుల్లో కన్పించడం విశేషం. కిమ్‌ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు.

ఆ క్షిపణి రేంజ్‌లో.. మొత్తం అమెరికా

మిలటరీ పరేడ్‌లో భాగంగా ఉత్తర కొరియా వద్ద ఉన్న అణ్వాయుధాలను, క్షిపణులను ప్రదర్శించారు. ఇందులో ప్రధానంగా ఆకట్టుకున్నది హ్వాసంగ్‌-17 ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం). ఈ క్షిపణిని ఉత్తర కొరియా ఈ ఏడాది మార్చిలో విజయవంతంగా ప్రయోగించింది. ‘అత్యంత శక్తిమంతమైన నూక్లియర్‌ వార్‌ డిటరెంట్‌’గా చెప్పే ఈ క్షిపణి.. 2017లో ప్రయోగించిన హ్వాసాంగ్‌-15 కంటే చాలా పెద్దది. ఈ బాలిస్టిక్‌ క్షిపణి ఆరు వేల కిలోమీటర్ల కంటే ఎత్తులో ప్రయాణించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్షిపణి పరిధిలో అమెరికా భూభాగం మొత్తం ఉండటం గమనార్హం.

కరోనా మహమ్మారితో ఆర్థికంగా కుదేలైనప్పటికీ.. క్షిపణి ప్రయోగాల విషయంలో మాత్రం ఉత్తర కొరియా దూకుడు తగ్గించట్లేదు. ఈ ఏడాదిలో ఇప్పటికే పదుల సంఖ్యలో క్షిపణి పరీక్షలు చేపట్టింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై అమెరికా చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ కిమ్‌ మాత్రం వెనక్కి తగ్గట్లేదు సరికదా.. అగ్రరాజ్యంపై ఒత్తిడి తెచ్చేలా ప్రయోగాలు పెంచుతూనే ఉన్నారు. 15వేల కిలోమీటర్ల వరకు దూసుకెళ్లే క్షిపణులను తయారు చేయనున్నట్లు గతంలో ప్రకటించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని