North Korea: మా అణ్వాయుధాలు ద.కొరియాను తుడిచిపెట్టేస్తాయి..!

దక్షిణ కొరియా ముందస్తు దాడులు చేస్తే వారి సైన్యాన్ని అణ్వాయుధాలతో తుడిచిపెట్టేస్తామని ఉ.కొరియా హెచ్చరించింది.

Published : 05 Apr 2022 13:22 IST

  కిమ్‌ సోదరి హెచ్చరికలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియా ముందస్తు దాడులు చేస్తే వారి సైన్యాన్ని అణ్వాయుధాలతో తుడిచిపెట్టేస్తామని ఉ.కొరియా హెచ్చరించింది. ఈ మేరకు ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ మూడు రోజుల్లో రెండోసారి హెచ్చరికలు జారీ చేశారు. అణుశక్తిపై ముందస్తు దాడుల గురించి ఆలోచించడం కూడా పెద్దతప్పే అని ఆమె ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ వద్ద పేర్కొన్నారు.  ‘‘ఒక వేళ మాతో సైనిక ఘర్షణను దక్షిణ కొరియా ఎంచుకొంటే.. మా అణ్వాయుధ దళం కూడా రంగంలోకి దిగి వారి విధులను నిర్వహిస్తుంది. దేశంపై దాడులు చేయాలంటే భయపడేలా చేయడం ప్రాథమికంగా ఆ దళం విధి. కానీ, దాడి మొదలైతే మాత్రం శత్రుసైన్యాన్ని నాశనం చేస్తుంది. అదేమీ మా దళాలకు పెద్ద విషయం కాదు’’ అని కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియా కీలక పాలసీ అడ్వైజర్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు.

రెండు రోజుల క్రితం కూడా యో జోంగ్‌ దక్షిణ కొరియా రక్షణ శాఖమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరితమైనవని ఆమె అన్నారు. ఉపద్రవం జరగకుండా ఉండాలని దక్షిణ కొరియా భావిస్తే మాత్రం ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. ఈ నెల ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ 110వ జయంతిని నిర్వహించుకోనుంది. ప్రస్తుత పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు ఆయన తాత అవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని