China: చైనాలో ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు..!

చైనా(China)లో కొవిడ్‌ విలయం వెనుక ఒకటికాదు.. ఏకంగా నాలుగు వేరియంట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర కొవిడ్‌ ప్యానల్‌ చీఫ్‌ వీకే అరోడా వెల్లడించారు. 

Published : 28 Dec 2022 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China)లో కొవిడ్‌ వెల్లువకు ఒకటి కాదు నాలుగు వేరియంట్లు కారణమని భారత ప్రభుత్వ కొవిడ్‌ ప్యానల్‌ చీఫ్‌ ఎన్‌కే అరోడా పేర్కొన్నారు. ఆయన ఓ ఆంగ్ల మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా(China) పరిస్థితి చూసి భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చైనా(China) నుంచి సమాచారం సరిగ్గా అందకపోవడంతో కేవలం అప్రమత్తంగా ఉంటూ.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడ కొవిడ్‌ వేవ్‌కు పలు రకాల వేరియంట్లే కారణమని వివరించారు. బీఎఫ్.7 వేరియంట్‌ కేసులు కేవలం 15శాతమే అని తెలిపారు. బీఎన్‌, బీక్యూ వేరియంట్ల నుంచి 50 శాతం కేసులు వస్తుండగా.. ఎస్‌వీవీ వేరియంట్‌ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. దీంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.

మరోవైపు భారత ప్రజల్లోని హైబ్రీడ్‌ ఇమ్యూనిటీ కారణంగా భయపడాల్సిన పనిలేదని అరోడా చెప్పారు. ఇది వ్యాక్సిన్ల ద్వారా, ఇన్ఫెక్షన్ల ద్వారా, కొవిడ్‌ తొలి, ద్వితీయ, తృతీయ వేవ్‌ల కారణంగా లభించిందన్నారు. ‘‘ఇక చైనా(China)లో వారికి ఇది కొత్త.. వారు ఇంతకు ముందు ఇన్ఫెక్షన్‌ బారిన పడలేదు. దీనికి తోడు వారు తీసుకొన్న వ్యాక్సిన్లు తక్కువ ప్రభావవంతమైనవనుకొంటా. వారు టీకాలు మూడు నాలుగు డోసులు తీసుకొన్నారు’’ అని వ్యాఖ్యానించారు.

చైనా(China)తో పోలిస్తే భారత్‌లో 97 శాతం మంది రెండు డోసుల టీకాలు తీసుకొన్నారని అరోడా వివరించారు. మిగిలిన వారు కనీసం ఒక్కసారైనా కొవిడ్‌ బారిన పడినట్లు పేర్కొన్నారు. ఇక 12 ఏళ్ల లోపు పిల్లల్లో 96శాతం మంది ఒక్కసారి వైరస్‌ బారిన పడినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్‌ జరుగుతున్నప్పుడు కూడా చాలా మందికి కొవిడ్‌ సోకిందని.. ఈ క్రమంలో చూస్తే మనం చాలా  సురక్షింతంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని