Charles Sobhraj: జైలు నుంచి విడుదలైన సీరియల్‌ కిల్లర్ చార్లెస్‌ శోభరాజ్‌

సీరియల్ కిల్లర్‌ చార్లెస్‌ శోభరాజ్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. వృద్ధాప్య కారణాలతో అతడిని విడుదల చేయాలని ఇటీవల నేపాల్‌ సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 23 Dec 2022 13:16 IST

కాఠ్‌మాండూ: కరడుగట్టిన సీరియల్‌ కిల్లర్‌ (serial killer) చార్లెస్‌ శోభరాజ్‌(78) నేపాల్‌ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. ఆరోగ్య కారణాల రీత్యా అతడిని విడుదల చేయాలని నేపాల్‌ (Nepal) సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో 19 ఏళ్ల తర్వాత  నేడు అతడిని జైలు నుంచి విడుదల చేసి తదుపరి ప్రక్రియ కోసం ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అప్పగించారు. అతడిని ఫ్రాన్స్‌కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులను చంపిన కేసులో శోభరాజ్‌ (Charles Sobhraj)ను 2003లో నేపాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నేపాల్‌ సుప్రీంకోర్టు అతడికి జీవితఖైదు విధించింది. దీంతో నాటి నుంచి అతడు జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. నేపాల్‌లో 20 ఏళ్ల కారాగారవాసాన్ని జీవితఖైదుగా పరిగణిస్తారు. శిక్షాకాలంలో 75 శాతాన్ని పూర్తిచేసుకొని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తాయి. దాన్ని ఆధారంగా చేసుకొని శోభారాజ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. వృద్ధాప్య కారణాల రీత్యా అతడిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

చార్లెస్‌ శోభరాజ్‌ భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి జన్మించాడు. అతడి చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన తల్లి రెండో భర్త అతడిని దత్తత తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత వారికి పిల్లలు పుట్టడంతో శోభరాజ్‌ను నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా అతడు నేరాల బాటపట్టాడు. 1970లలో ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలు, దోపిడీలకు పాల్పడటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. ఆపై 20 హత్య కేసుల్లో చిక్కుకున్న శోభరాజ్‌.. దిల్లీలోని ఓ ఫ్రెంచ్‌ పౌరుడికి విషం ఇచ్చి చంపిన కేసులో 1976లో అరెస్టయి భారత్‌లోని వివిధ జైళ్లలో 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఓసారి భారత్‌లోని ఓ జైల్లో సిబ్బందికి పార్టీ పేరిట డ్రగ్స్‌ ఇచ్చి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతడిని మళ్లీ అరెస్టు చేశారు.

1970ల్లో అతడు 15-20 మందిని హత్య చేసినట్లు అంచనా. ఆసియా పర్యటనకు వచ్చే పాశ్చాత్య దేశాల పౌరులతో స్నేహం చేసి.. తర్వాత వారికి మత్తుమందులు ఇచ్చి చంపేవాడు. అతడి చేతుల్లో హత్యకు గురైనవారిలో ఇద్దరి ఒంటిపై కేవలం బికినీలే కనిపించాయి. అందుకే అతణ్ని ‘బికినీ కిల్లర్‌’ అని కూడా పిలుస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు