Nuclear weapons: ప్రయోగానికి సిద్ధంగా 2,100 అణ్వాయుధాలు

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధోసంస్థ  స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రీ) వెల్లడించింది. ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతోందని పేర్కొంది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతం ఎగబాకిందని తెలిపింది.

Updated : 18 Jun 2024 06:25 IST

సింహభాగం అమెరికా, రష్యాలవే
‘సిప్రీ’ నివేదికలో వెల్లడి

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధోసంస్థ  స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రీ) వెల్లడించింది. ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతోందని పేర్కొంది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతం ఎగబాకిందని తెలిపింది. భారత్, పాకిస్థాన్‌ సహా 9 అణ్వస్త్ర దేశాలు గత ఏడాది తమ అణ్వాయుధాగారాలను ఆధునికీకరించాయని వివరించింది. కొన్ని దేశాలు సరికొత్త అణు సామర్థ్య ఆయుధ వ్యవస్థలను మోహరించాయంది. ఈమేరకు వార్షిక ‘సిప్రీ ఇయర్‌ బుక్‌ 2024’ను సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం.. 

  • ప్రపంచంలోనే అత్యంత వేగంగా చైనా అణ్వాయుధాగారం పెరుగుతోంది. 2023 జనవరిలో ఆ దేశం వద్ద 410 అస్త్రాలు ఉండేవి. ఈ ఏడాది జనవరికి వాటి సంఖ్య 500కు పెరిగింది. ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకోవచ్చు. 
  • 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయి. వీటిలో 9,585 ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో భద్రపరిచారు. 3,904 అస్త్రాలను క్షిపణులు, యుద్ధ విమానాల్లో మోహరించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 60 పెరిగింది. 
  • దాదాపు 2,100 ఆయుధాలను ఏ క్షణమైనా ప్రయోగించేలా బాలిస్టిక్‌ క్షిపణుల్లో పూర్తిస్థాయి పోరాట సన్నద్ధత స్థితిలో ఉంచారు. అవన్నీ రష్యా, అమెరికాకు చెందినవే. తొలిసారి చైనా సైతం కొన్ని అణ్వస్త్రాలను ఇలాంటి స్థితిలో ఉంచింది. 
  • భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియాలు బాలిస్టిక్‌ క్షిపణుల ద్వారా బహుళ వార్‌హెడ్‌లు బట్వాడా చేసే సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకు ఆ సత్తా ఉంది. 
  • గత ఏడాదిలో భారత్‌ చాలా స్వల్ప స్థాయిలో అణ్వాయుధాలను పెంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని