Britain: బోరిస్‌కు పదవీ గండం.. బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి?

అన్నీ కలిసొస్తే బ్రిటన్‌ అధికార పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆ దేశ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది....

Updated : 15 Jan 2022 10:56 IST

లండన్‌: అన్నీ కలిసొస్తే బ్రిటన్‌ అధికార పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆ దేశ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి పదవిలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌కు కాలం దగ్గరపడిందని పలు  పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో జరుగుతోన్న బెట్టింగ్‌లు కూడా దాన్ని బలపరుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

బోరిస్‌ జాన్సన్‌ (57)పై ఇటీవల పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర క్రితం దేశాన్ని కొవిడ్‌ కుదిపేస్తున్న సమయంలో ‘10 డౌన్‌ స్ట్రీట్‌’లోని అధికారిక నివాసంలో తన సహచరులతో కలిసి మద్యంతో విందు నిర్వహించిన ఘటన ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. అప్పటికే కరోనా కట్టడి నిమిత్తం దేశంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అటువంటి సమయంలో జాన్సన్‌ విందు ఏర్పాటు చేయడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష లేబర్‌ పార్టీయేగాక.. సొంత కన్జర్వేటివ్‌ పార్టీ నుంచీ ఒత్తిడి పెరిగింది. చివరకు ఆయన గురువారం దిగువ సభ ‘హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌’ సాక్షిగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

అయినప్పటికీ.. బోరిస్ దిగిపోవాల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఆయన వారసుడు ఎవరనే విషయంలో ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు బలంగా వినిపిస్తోంది. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బోరిస్‌ క్షమాపణలు చెబుతున్న సమయంలో రిషి అక్కడ లేకపోవడంపై ఆ దేశంలోని ప్రధాన పత్రికలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ప్రధానిపై వస్తున్న ఆరోపణల నుంచి దూరంగా ఉండే ఉద్దేశంతోనే ఆయన సభకు రాలేదని పేర్కొన్నాయి.

కానీ అది నిజం కాదని రిషి సునక్‌ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. ఉద్యోగ కల్పనపై కొనసాగుతున్న బృహత్‌ ప్రణాళికపై వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్న క్రమంలోనే తాను సభకు హాజరుకాలేకపోయానని తెలిపారు. ప్రధాని క్షమాపణలు చెప్పడాన్ని సమర్థించారు. ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణ ముగిసే వరకు సహనంతో ఉండాలని బోరిస్‌ చేసిన విజ్ఞప్తికి తాను మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని కూడా అక్కడి పత్రికలు, మీడియా హౌస్‌లు భిన్నంగా విశ్లేషించాయి. బోరిస్‌కు మద్దతుగా నిలవడంతో రిషి స్పందన చాలా పేలవంగా ఉందని పేర్కొన్నాయి. బోరిస్‌ సహా అధికార వర్గాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు వస్తున్న వార్తలపై ‘సూ గ్రే’ అనే సీనియర్ సివిల్‌ సర్వెంట్‌ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.

ఇలాంటి ఊహాగానాలపై ‘బెట్‌ఫెయిర్‌’ అనే ఆన్‌లైన్‌ సంస్థ బెట్టింగ్‌ నిర్వహిస్తుంటుంది. బోరిస్‌ తప్పుకొంటే ప్రధాని రేసులో రిషి సునక్‌కు అత్యధిక మంది మద్దతు లభించే అవకాశం ఉన్నట్లు బెట్‌ఫెయిర్‌ ప్రతినిధి శామ్‌ రాస్‌బాటమ్‌ ‘వేల్స్‌ఆన్‌లైన్‌’ అనే వార్తాసంస్థకు తెలిపారు. తర్వాతి స్థానంలో విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్‌, క్యాబినెట్‌ మంత్రి మైకేల్‌ గోవ్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశాంగశాఖ మాజీ సెక్రటరీ జెరెమీ హంట్‌, భారత సంతతికి చెందిన హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌, హెల్త్‌ సెక్రటరీ సజిద్‌ జావిద్‌, క్యాబినెట్‌ మంత్రి ఒలివర్‌ డోడెన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

బెట్‌ఫెయిర్‌.. ఎక్స్ఛేంజీ సర్వీసులను కూడా అందిస్తుంటుంది. ఇందులో గ్యాంబ్లర్లు బెట్టింగ్‌ కోసం సొంతంగా మార్కెట్‌ను సృష్టించుకోవచ్చు. బోరిస్‌ జాన్సన్‌పై నిర్వహిస్తున్న బెట్టింగ్‌ మార్కెట్‌ సూచీ.. ఈ ఏడాది చివరకు బోరిస్‌ తన పదవిని కోల్పోనున్నట్లు సూచిస్తోంది. ఇక వివిధ బెట్టింగ్‌లను పోల్చి చూసే ‘ఆడ్స్‌చెకర్‌’ సైతం బోరిస్ వారసుల రేసులో రిషి సునక్‌ ముందంజలో ఉన్నట్లు పేర్కొంది.

బోరిస్‌ క్షమాపణలు చెప్పడానికి ముందు ‘యూగవ్‌’ పేరిట ‘ది టైమ్స్’ ఓ సర్వే నిర్వహించింది. ప్రతి పది మందిలో ఆరుగురు బోరిస్‌ రాజీనామా చేయాల్సిందేనన్నారు. చివరి ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీకి ఓటేసిన వారిలోనూ 38 శాతం మంది ఆయన పదవిని వదులుకోవాల్సిందేనని తేల్చారు. ఇక ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు బోరిస్‌ నిజాయతీగా సమాధానాలు ఇవ్వడం లేదని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. వీరిలో 63 శాతం మంది కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన వారు ఉండడం గమనార్హం.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts