Omicron: తక్కువేం కాదు!టీకా తీసుకోనివారిపై ఒమిక్రాన్‌ ప్రభావం ఎక్కువే...

 ‘తక్కువేం కాదు. ఒమిక్రాన్‌ ప్రభావం ఎక్కువే’నని అంటున్నారు... యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌ పరిశోధకులు! 

Published : 15 Jan 2022 09:57 IST

టీకా కంటే ముందే లక్షల మందికి ఒమిక్రాన్‌!
బ్రిటన్‌ పరిశోధకుల విశ్లేషణ

సౌతాంప్టన్‌: ‘తక్కువేం కాదు. ఒమిక్రాన్‌ ప్రభావం ఎక్కువే’నని అంటున్నారు... యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌ పరిశోధకులు! ఈ కరోనా కొత్త వేరియంట్‌ ఇప్పటి మాదిరే వేగంగా వ్యాపిస్తే... వచ్చే మూడు నెలల్లో కొత్తగా 300 కోట్ల కేసులు నమోదవడం ఖాయమంటున్నారు. ఐరోపా, ఉత్తర అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కేసులు అసంఖ్యాకంగా పెరుగుతున్నాయనీ; టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతున్న ప్రాంతాల్లోనే ఒమిక్రాన్‌ వ్యాప్తి అధికంగా ఉందంటూ విశ్లేషించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ సీనియర్‌ పరిశోధకుడు మైకేల్‌ తన బృందం సాగించిన అధ్యయన వివరాలను పంచుకున్నారు.

‘‘కొత్త ఏడాది సగం గడిచేసరికి ప్రతి దేశ జనాభాలో 70% మందికి వ్యాక్సిన్‌ అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం పెట్టుకుంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగాన్ని చూస్తే, టీకాల కంటే ముందే కోట్ల మందిని వైరస్‌ చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్రికాలో ఇప్పటికీ 85% మందికి వ్యాక్సిన్‌ అందలేదు.

అది తప్పుడు భావన...

ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉందని భావించడం సరికాదు. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి దానివల్ల ముప్పు తీవ్రంగానే ఉంటోంది. ఒమిక్రాన్‌ తొలిసారి వెలుగులోకి వచ్చినప్పుడు... కొందరు పరిశోధకులు టీకా కార్యక్రమం విస్తృతంగా జరుగుతున్న దేశాల్లో దాని వ్యాప్తి, తీవ్రతలను పరిగణనలోకి తీసుకుని, సమీక్షించారు. టీకా తీసుకున్నవారితో పోలిస్తే, తీసుకోనివారికి... ఒమిక్రాన్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరాల్సిన ముప్పు 8 రెట్లు అధికంగా ఉంటోంది. ఇప్పటికే మహమ్మారికి గురైనా, వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో కొవిడ్‌ నుంచి రక్షణ లభిస్తుంది’’ అని మైకేల్‌ హెడ్‌ అభిప్రాయపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని