Omicron infection: బూస్టర్‌ డోసు కంటే దానితోనే మెరుగైన రోగనిరోధకత..!

ఒమిక్రాన్‌ వల్ల కలిగే బ్రేక్‌ థ్రూ ఇన్ఫెక్షన్‌తో లభించే రోగనిరోధకత.. వివిధ రకాలైన కరోనా వేరియంట్లను అడ్డుకోగలదట. బూస్టర్ డోసు కంటే ఈ ఇన్ఫెక్షన్‌తోనే మెరుగైన నిరోధక శక్తి లభిస్తుందట.

Published : 16 May 2022 18:23 IST

వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌ వల్ల కలిగే బ్రేక్‌ థ్రూ ఇన్ఫెక్షన్‌తో లభించే రోగనిరోధకత.. వివిధ రకాలైన కరోనా వేరియంట్లను అడ్డుకోగలదట. బూస్టర్ డోసు కంటే ఈ ఇన్ఫెక్షన్‌తోనే మెరుగైన నిరోధక శక్తి లభిస్తుందట. టీకా తయారీ సంస్థ బయోన్‌టెక్, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్ చేసిన అధ్యయనాల్లో ప్రాథమికంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్లు ఉనికి చాటుతోన్న వేళ..ఈ విషయం ఆశాజనకంగా ఉంది. మరో కొత్త వేరియంట్ సోకినా.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని అధ్యయనకర్తలు అంచనా వేస్తున్నారు.

‘బ్రేక్‌ థ్రూ ఇన్ఫెక్షన్‌.. మరో టీకా డోసుకు తప్పనిసరిగా సమానమని మనం భావించాలి’ అంటూ బయోన్‌టెక్ అధ్యయాన్ని సమీక్షించిన ప్రొఫెసర్ జాన్‌ వెర్రీ వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఎవరైనా కొవిడ్ బారినపడితే.. వారు మరో బూస్టర్ డోసు తీసుకునేందుకు వేచి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే బాధితుల నాసికా శ్లేష్మంలో యాంటీబాడీలను పరిశోధకులు గుర్తించారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే నిర్వీర్యం చేయడంలో అవి సహకరించవచ్చన్నారు. అయితే టీకాలు పొందని వారికి ఒమిక్రాన్‌ సోకితే ఈ విధమైన ప్రతిస్పందన కనిపించడం లేదని తెలిపారు. తర్వాత వారికి దీనికి భిన్నమైన వేరియంట్‌ సోకితే సమస్యగా మారొచ్చన్నారు. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. చైనాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆరువారాలుగా చైనా ప్రజలు కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అనుభవించారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండటంతో మరిన్ని కొత్త ఉత్పరివర్తనలు పుట్టుకొస్తున్నాయి. దేశాలు ఆంక్షలను సడలిస్తుండటంతో దీని వ్యాప్తికి మరింత అవకాశం ఏర్పడుతోంది. ఈ సమయంలో ఒమిక్రాన్‌ లక్ష్యంగా చేసుకుని టీకాలను అభివృద్ధి చేయాలా వద్దా అనేదానిపై నియంత్రణ సంస్థలు యోచిస్తున్నాయని ఈ అధ్యయనకర్తల్లో ఒకరు వెల్లడించారు.

మొదటిసారి దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌తో భారత్‌ వంటి దేశాల్లో వ్యాధి తీవ్రత తక్కువగానే కనిపించింది. అయితే భవిష్యత్తులో వచ్చే వేరియంట్లతో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందన్న హామీ లేదు. రానున్న రోజుల్లో మహమ్మారి తీవ్రత.. ప్రజల రోగ నిరోధకత స్థాయులపైనే పూర్తిగా ఆధారపడి ఉండదని, వైరస్‌లో వచ్చే మార్పులపై కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు