Long Covid: ఒమిక్రాన్‌తో దీర్ఘకాల కొవిడ్‌ ముప్పు తక్కువే!

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ బారిన పడినవారు దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడే అవకాశాలు తక్కువేనని తాజాగా ఓ బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు.. జోయ్‌ కొవిడ్‌ యాప్‌ వివరాల ఆధారంగా ఈ అధ్యయనం...

Published : 17 Jun 2022 22:15 IST

బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడి

లండన్: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ బారిన పడినవారు దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడే అవకాశాలు తక్కువేనని తాజాగా ఓ బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు.. జోయ్‌ కొవిడ్‌ యాప్‌ వివరాల ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. బ్రిటన్‌లో డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేవ్‌ సమయంలో ఇన్ఫెక్షన్‌ సోకినవారిలో దీర్ఘకాల కొవిడ్ అభివృద్ధి చెందే అవకాశాలు 20 శాతం నుంచి 50 శాతం వరకు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. రోగి వయస్సు, చివరి డోసు ఎప్పుడు తీసుకున్నారో బట్టి ఈ శాతం మారుతున్నట్లు తెలిపారు.

ఈ అధ్యయనంలో.. ఒమిక్రాన్‌ గరిష్ఠ స్థాయి(డిసెంబర్ 2021- మార్చి 2022) సమయంలో వైరస్‌ బారిన పడిన 56,003 మందిలో 4.5 శాతం మంది దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అదే, జూన్-నవంబర్ 2021లో డెల్టా వేవ్ సమయంలో 41,361 బాధితుల్లో ఇది 10.8 శాతంగా నమోదైంది. ‘లాన్సెట్ జర్నల్‌’లోనూ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. అయితే.. దీనర్థం దీర్ఘకాల కొవిడ్ రోగుల సంఖ్య తగ్గిపోతున్నట్లు కాదని పరిశోధకుల బృందం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్‌ ఎక్కువ మందికి సోకిన నేపథ్యంలో.. బాధితుల సంఖ్య ఎక్కువే ఉందని చెప్పింది.

ఒమిక్రాన్‌తో లాంగ్‌ కొవిడ్‌ ముప్పు తక్కువగా ఉండటం మంచి వార్తే అయినప్పటికీ.. దీర్ఘకాల లక్షణాలకు చికిత్సను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధాన పరిశోధకుడు డా.క్లైర్ స్టీవ్స్ ఓ వార్తాసంస్థతో అన్నారు. మరోవైపు.. ఒమిక్రాన్‌ వేవ్‌ తర్వాత దేశంలో 4.38 లక్షల మంది దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుతున్నారని బ్రిటన్‌ జాతీయ గణాంకాల కార్యాలయం గత నెలలో తెలిపింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తర్వాత దీర్ఘకాల లక్షణాల ముప్పు తక్కువే ఉందని, అయితే.. ఇది రెండు డోసులు పూర్తయిన వ్యక్తుల్లో మాత్రమేనని పేర్కొంది.

దీర్ఘకాల కొవిడ్‌ కారణంగా అలసట, మెదడు మొద్దుబారడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు.. వారాలు లేదా నెలల తరబడి కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో.. గత వేరియంట్‌ల మాదిరి ఒమిక్రాన్‌ కూడా దీర్ఘకాల కొవిడ్‌కు కారణమవుతుందా? అని కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఒమిక్రాన్‌తో లాంగ్‌ కొవిడ్‌ ముప్పు అంతగా లేదని చూపిన మొదటి అధ్యయనంగా కింగ్స్ కాలేజ్‌ పరిశోధన నిలిచింది! అయితే, ఒమిక్రాన్ ఎందుకు తక్కువ దీర్ఘకాల కొవిడ్ ముప్పు కలిగి ఉందో నిర్ధారించేందుకు మరింత అధ్యయనం అవసరమని బృందం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని