Published : 16 Feb 2022 01:45 IST

WHO: ‘ఈ ప్రాంతంలో ఒమిక్రాన్‌ ముప్పు ఎక్కువగానే ఉంది’

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ ఎత్తున ఒమిక్రాన్‌ కేసులతో సతమతమైన యూరప్‌ దేశాలు.. ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, తూర్పు యూరప్‌ వైపు వైరస్‌ ముప్పు ఎక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మంగళవారం తెలిపింది. గత రెండు వారాల్లో అర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, జార్జియా, రష్యా, ఉక్రెయిన్‌లలో కొవిడ్ కేసులు రెండింతలు పెరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ ఐరోపా ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ క్లూగే ఒక ప్రకటనలో వెల్లడించారు. కొన్నాళ్లుగా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. చెక్ రిపబ్లిక్, పోలాండ్‌ తదితర దేశాలు వచ్చే నెల నుంచి ఆంక్షలను సడలించాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతుండటం, తూర్పు ఐరోపాలో డెల్టా కేసులూ బయటపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడి చర్యలను ఎత్తివేయడం తగదని క్లూగే అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్‌తోపాటు మహమ్మారి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. కొవిడ్‌ పరీక్షలు, మాస్కు తప్పనిసరి వంటివి నిరంతరం కొనసాగించాలన్నారు. యూరప్‌లో ఇప్పటివరకు 16.5 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయని, గత వారంలోనే 25 వేల మంది మృతి చెందారని గుర్తుచేశారు. మరోవైపు.. స్థానికంగా టీకా రేటు తక్కువగా ఉన్న దేశాలు ఈ విషయమై పరిశీలన చేసుకోవాలని సూచించారు. బోస్నియా-హెర్జెగోవినా, బల్గేరియా, కిర్గిజ్‌స్థాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్‌లలో 60 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. వెంటనే టీకాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts