Omicron: ఒమిక్రాన్‌ లక్షణాలు స్వల్పంగా ఎందుకు ఉంటున్నాయంటే..!

ఒమిక్రాన్‌ వేరియంట్‌ గుణం కంటే వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ప్రజల్లో అధికంగా ఉండడమే కారణమనే అంచనాకు వచ్చారు.

Updated : 05 Feb 2022 02:43 IST

అమెరికా పరిశోధకుల తాజా అంచనా

వాషింగ్టన్‌: అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ కాస్త తక్కువ తీవ్రత కలిగినట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటికి గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమైన నిపుణులు.. వైరస్‌ గుణం కంటే వాటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ప్రజల్లో అధికంగా ఉండడమే కారణమనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన శాస్త్రవేత్తలు, సాధ్యమైనంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు కరోనా వ్యాక్సిన్లను అందించే ప్రయత్నం చేయాలని సూచించారు.

ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి స్థాయికి సంబంధించిన అంశాల వల్లే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 2021 చివరినాటికి దక్షిణాఫ్రికా ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడమో లేదా అంతకుముందు వేవ్‌లలో వైరస్‌కు గురై ఉండవచ్చని అంచనా వేశారు. ఇలా గతంలో ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం వల్లే ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత తక్కువగా ఉండవచ్చని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆస్పత్రితోపాటు హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతోపాటు రీఇన్‌ఫెక్షన్‌కు గురిచేసే సామర్థ్యం ఒమిక్రాన్‌కు తక్కువగా ఉండడం వల్లే లక్షణాలు తక్కువగా కనిపిస్తూ ఉండవచ్చని అన్నారు.

గతేడాది నవంబర్‌లో బోట్సువానాలో మొదటగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూసిన విషయం తెలిసిందే. స్వల్ప కాలంలోనే ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించింది. అంతేకాకుండా పలు దేశాల్లో కొత్త వేవ్‌లకు కారణమయ్యింది. అయితే, ఇతర వేరియంట్ల ప్రభావంతో పోలిస్తే ఒమిక్రాన్‌ వల్ల ఆస్పత్రి చేరికలు, మరణాల రేటు తక్కువగానే ఉన్నట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే తక్కువ హాని కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధన చేపట్టారు. తాజా అధ్యయనం న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని