Solar Cycle: సూర్యుడి ఉగ్రరూపం! అసలేం జరుగుతోంది..?

సూర్యుడిపై ఏం జరుగుతోంది? సమస్త జీవరాశికి మూలమైన ఈ నక్షత్రంపై కేవలం రెండు వారాల వ్యవధిలోనే 35 భారీ విస్ఫోటనాలు(కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌), 14 సన్‌స్పాట్‌(చీకటి ప్రదేశాలు)లు‌, ఆరు సౌర జ్వాలలు...

Published : 09 Aug 2022 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్యుడి(Sun)పై ఏం జరుగుతోంది! సమస్త జీవరాశికి మూలమైన ఈ నక్షత్రంపై కేవలం రెండు వారాల వ్యవధిలోనే 35 భారీ విస్ఫోటనాలు(Coronal mass ejections), 14 సన్‌స్పాట్‌(Sunspots)లు‌, ఆరు సౌర జ్వాలలు(Solar Flares) సంభవించాయి. వాటిలో కొన్ని నేరుగా భూమినీ తాకాయి! అయితే.. ‘సౌర చక్రం(Solar Cycle)’ గరిష్ఠ స్థాయికి సమీపిస్తుండటమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘2025లో సౌర చక్రం గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. ఇది సమీపంలోనే ఉన్నందున ఈ తరహా ఘటనలు పెరుగుతూనే ఉంటాయి. కానీ, గత కొన్ని వారాల్లో ఇవి అంచనాలకు మించి వేగంగా సంభవిస్తున్నాయి. భూమిపై ఉన్న జీవరాశులు, సాంకేతికత, అలాగే కృత్రిమ ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, వ్యోమగాములపైనా ఇవి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి’ అని నాసా(NASA) తెలిపింది.

ఏమిటీ సౌర చక్రం..

నాసా ప్రకారం.. సూర్యుడి అయస్కాంత క్షేత్రం ఒక భ్రమణం పూర్తి చేస్తే దానిని సౌర చక్రంగా పరిగణిస్తారు. ప్రతి 11 ఏళ్లకు భానుడి అయస్కాంత క్షేత్రం పూర్తిగా తలకిందులవుతుంది. ఉత్తర, దక్షిణ ధ్రువాలు స్థానాలు మార్చుకుంటాయి. సౌర చక్రం గరిష్ఠ దశలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆ సమయంలో సూర్యుడి ఉపరితలం అల్లకల్లోలంగా మారుతుంది. భారీ స్థాయి విస్ఫోటనాలు, సౌర జ్వాలలు సంభవిస్తుంటాయి. ఆ తర్వాత మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. గరిష్ఠ దశలో ఉన్నప్పుడు దానినుంచి వెలువడే సౌర తుపానులు, విస్ఫోటనాలతో సౌర వ్యవస్థతోపాటు కృత్రిమ ఉపగ్రహాలు, కమ్యూనికేషన్‌ సిగ్నళ్లు ప్రభావితం అవుతుంటాయి.

* సూర్యుని ఉపరితలంపై సంభవించే భారీ విస్ఫోటనాలను ‘కరోనల్ మాస్ ఎజెక్షన్‌’గా పేర్కొంటారు. ఆ సమయంలో బిలియన్‌ టన్నుల పదార్థం అంతరిక్షంలోకి వెలువడి.. గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

సూర్యుడి ఉపరితలంపై చీకటిగా కనిపించే ప్రాంతాలను సన్‌స్పాట్‌లు అంటారు. నక్షత్రం ఉపరితలంపైన ఇతర భాగాల కంటే అక్కడ చల్లగా ఉండటంతో అవి అలా కనిపిస్తాయి.

సన్‌స్పాట్‌ల సమీపంలో అయస్కాంత క్షేత్రాల పునర్వ్యవస్థీకరణతో ఆకస్మికంగా వెలువడే శక్తిని సోలార్‌ ఫ్లేర్స్‌గా పిలుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని