Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!

జర్మనీలో జీ-7 నేతల కీలక భేటీ వేళ.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున ఓ నివాస భవనంపై జరిపిన క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందగా, ఓ చిన్నారితోసహా ముగ్గురు గాయపడ్డారు...

Published : 27 Jun 2022 01:37 IST

కీవ్‌: జర్మనీలో జీ-7 నేతల కీలక భేటీ వేళ.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున ఓ నివాస భవనంపై జరిపిన క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందగా, ఓ చిన్నారి సహా పలువురు గాయపడ్డారు. నగర మేయర్‌ విటాలి క్లిట్‌ష్కో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జీ-7, నాటో సమావేశాలకు ముందు ఉక్రెనియన్లను భయపెట్టడానికే ఈ దాడి జరిపిందంటూ ఆరోపించారు. దాదాపు మూడు వారాల తర్వాత కీవ్‌ లక్ష్యంగా జరిగిన దాడి ఇది. రష్యాను నిలువరించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ జీ-7 దేశాలకు ఉక్రెయిన్‌ పిలుపునిచ్చిన సమయంలో ఇది చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు.. ఉత్తర, పశ్చిమ ఉక్రెయిన్‌లలోని మూడు సైనిక కేంద్రాలపై తమ సేనలు దాడులు చేపట్టాయని మాస్కో ప్రకటించింది. వాటిలో ఒకటి పోలాండ్‌ సరిహద్దుకు సమీపంలో ఉందని వెల్లడించింది.

కీవ్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఖండించారు. అనాగరిక చర్య అంటూ రష్యాపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ వారంలో జీ-7తోపాటు నాటో శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. రష్యా బంగారం దిగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయంతో జీ-7 చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా మరిన్ని ఆంక్షల కోసం డిమాండ్‌ చేశారు. కీవ్‌ దాడిలో గాయపడిన చిన్నారిని స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఆయన.. ‘రష్యా క్షిపణి ఆమె ఇంటిని ధ్వంసం చేసే వరకు కీవ్‌లోని ఈ ఏడేళ్ల చిన్నారి ప్రశాంతంగా నిద్రపోయింది. ఇలా దేశంలోని అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. క్రెమ్లిన్‌పై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్‌కు మరిన్ని భారీ ఆయుధాలు సమకూర్చేలా.. జీ-7 నేతలు స్పందించాలి. రష్యా కుటిల సామ్రాజ్యవాదాన్ని ఓడించాలి’ అని పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని