US Visa: బిజినెస్‌, పర్యాటక వీసాపైనా ఇంటర్వ్యూలకు హాజరవ్వొచ్చు

US Visa: బి-1, బి-2 వీసాదారులు సైతం అమెరికాలో కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీ వెల్లడించింది. 

Updated : 23 Mar 2023 18:04 IST

వాషింగ్టన్‌: అమెరికాకు పర్యాటక, బిజినెస్‌ వీసాపైనా దేశంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు సైతం హాజరవ్వొచ్చని ఇక్కడి ఫెడరల్‌ ఏజెన్సీ వెల్లడించింది. బి-1, బి-2 వీసాదారులకు ఈ అవకాశం ఉందని స్పష్టంచేసింది. అయితే, ఉద్యోగాల్లో చేరే ముందు మాత్రం వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. బి-1, బి-2 వీసాలను ‘బి వీసాలు’గా పేర్కొంటారు. అమెరికాలో పర్యటన కోసం ఈ వీసాలు జారీ చేస్తారు. బి-1 వీసా తాత్కాలిక బిజినెస్‌ ట్రిప్‌ కోసం ఉద్దేశించినది కాగా.. పర్యాటకానికి వచ్చిన వారికి బి-2 వీసాలను జారీ చేస్తారు. ఇటీవల అమెరికాలోని పలు కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి ఈ తరహా ఆప్షన్‌ ఒకటి ఉందని తెలియజేయడం కోసం యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) వరుస ట్వీట్లు చేసింది.

‘బి-1, బి-2 వీసా స్టేటస్‌పై అమెరికాలో కొత్త జాబ్‌ వెతుక్కునే వెసులుబాటు ఉందా? అని చాలా మంది అడుగుతున్నారు. అవును, ఉంది. బి-1, బి-2 వీసాలపై ఇక్కడ ఉద్యోగం కోసం అన్వేషించొచ్చు. ఉద్యోగ ఇంటర్వ్యలకూ హాజరు కావొచ్చు’’ అని USCIS ట్విటర్‌లో వెల్లడించింది. ఒకవేళ కొత్త ఉద్యోగం సాధిస్తే మాత్రం బి-1, బి-2 స్టేటస్‌ మార్చుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది. సాధారణంగా హెచ్‌-1బి వీసాలపై  మన దేశం నుంచి అధిక సంఖ్యలో అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. ఒకవేళ లేఆఫ్‌ల్లో భాగంగా ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం దొరక్కపోతే దేశం వీడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌, గూగుల్‌, మెటా వంటి పెద్ద  పెద్ద కెంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో బి-1, బి-2 కేటగిరీ వీసాల్లో ఉన్న వెసులుబాటును ఫెడరల్‌ ఏజెన్సీ గుర్తు చేసింది. అలాంటి వారు ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌ను మార్చుకోవాలని సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు