Ukraine crisis: ప్రతి సెకనుకు ఒక చిన్నారి శరణార్థి అవుతున్నాడు!

రష్యా దండయాత్రతో ఉక్రెయిన్‌ వణుకుతోంది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో సర్వం కోల్పోయిన జనం ....

Published : 16 Mar 2022 02:13 IST

జెనీవా: రష్యా దండయాత్రతో ఉక్రెయిన్‌ వణుకుతోంది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో సర్వం కోల్పోయిన జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు వలసలు పోతున్నారు. వందల కి.మీలు నడుచుకుంటూ వెళ్లే వారు కొందరైతే.. రైళ్లు, ఇతర వాహనాల్లో దేశ సరిహద్దులు దాటిపోతున్న వారు మరికొందరు. ముఖ్యంగా చిన్నారులను రక్షించుకొనేందుకు వారిని బలవంతంగా పొరుగు దేశాలకు తరలిస్తున్నారు. ఈ యుద్ధంలో ప్రతి సెకనుకు దాదాపుగా ఒక చిన్నారి శరణార్థిగా మారుతున్నట్టు ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థ యూనిసెఫ్‌ తెలిపింది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో 596 మంది పౌరులు మరణించారనీ.. అయితే, వాస్తవంగా ఈ సంఖ్య మరింత భారీగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. లక్షలాది ప్రజలు తమ ఇళ్లను విడిచి పక్కదేశాలకు వలసపోతున్నారనీ.. ఇప్పటివరకు 2.8మిలియన్ల మందికి పైగా ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి పోలండ్‌, ఇతర పొరుగుదేశాలకు వెళ్లినట్టు తెలిపింది. గత 20 రోజులుగా ఉక్రెయిన్‌లో సగటున ప్రతిరోజూ 70వేల మందికి పైగా చిన్నారులు శరణార్థులుగా మారుతున్నారని యునిసెఫ్‌ పేర్కొంది.

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు దాదాపు 1.5 మిలియన్ల మంది చిన్నారులు ఉక్రెయిన్‌ నుంచి బలవంతంగా తరలి వెళ్లాల్సి రావడం తీవ్రంగా కలవరపెడుతోందని యూనిసెఫ్‌ అధికార ప్రతినిధి జేమ్స్‌ ఎల్డెర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. యుద్ధం ప్రారంభమైనప్పట్నుంచి ప్రతి నిమిషానికి దాదాపు 55 మంది పిల్లలు.. లేదా ప్రతి సెకనుకు దాదాపుగా ఒక పిల్లవాడు శరణార్థిగా మారుతున్నాడంటూ ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు. గత 20 రోజులుగా ఉక్రెయిన్‌లో సగటున రోజూ 70వేల మందికి పైగా చిన్నారులు శరణార్థులుగా మారుతున్నారని యునిసెఫ్‌ అధికార ప్రతినిధి జేమ్స్‌ ఎల్డెర్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు