Israel Hamas: నరమేధానికి నెల రోజులు.. భీకర యుద్ధంలో 11వేలు దాటిన మరణాలు

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్ల మధ్య జరుగుతోన్న యుద్ధంలో (Hamas Israel Conflict) మొత్తంగా 11వేల మందికి పైగా మరణించినట్లు సమాచారం.

Updated : 06 Nov 2023 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలతెలవారుతుండగా ఇజ్రాయెల్‌పైకి దూసుకొచ్చిన వేలకొద్ది రాకెట్లు.. ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్‌ సేనల భీకర దాడులు.. ఇలా హమాస్‌- ఇజ్రాయెల్‌ యుద్ధానికి (Hamas Israel Conflict) సరిగ్గా నెల రోజులు (నవంబర్‌ 7తో) పూర్తవుతుంది. హమాస్‌ అంతమే లక్ష్యంగా పోరు చేస్తోన్న ఇజ్రాయెల్‌ సైన్యం (IDF).. ఇప్పటివరకు 12 వేలకుపైగా హమాస్‌ అనుమానిత స్థావరాలను భూస్థాపితం చేసింది. మరోవైపు ఈ దాడులు ఇరువైపులా పెద్దఎత్తున ప్రాణనష్టానికి దారితీశాయి. కేవలం గాజాలోనే మృతుల సంఖ్య 10 వేలు దాటింది. అయినప్పటికీ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ (Benjamin Netanyahu) ససేమిరా అనడం.. వేల సంఖ్యలో చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతుండటం యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

మార్చి.. ఏమార్చి.. ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్‌ వ్యూహం..!

 • ‘ఆపరేషన్‌ అల్‌-అక్సా స్ట్రామ్‌’ పేరుతో గాజాలోని పాలస్తీనా మిలిటెంట్లు అక్టోబర్‌ 7 తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించి బీభత్సం సృష్టించారు.
 • ఆర్మీ వాహనాలు, పారగ్లైడర్లతో దాదాపు 2500 మంది హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. సరిహద్దు కంచెను తొలగించి మరీ ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. అనంతరం జరిపిన దాడుల్లో 1400 మంది ఇజ్రాయెల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
 • ఈ క్రమంలో ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దులోని నెగెవ్‌ ఎడారి ప్రాంతంలో ‘ది సూపర్‌ నోవా’ పేరిట ఏర్పాటు చేసిన ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్కడున్న వారిలో 260 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడం యావత్‌ ప్రపంచాన్ని కలచివేసింది.
 • పార్టీలో పాల్గొన్న విదేశీయులను తీసుకెళ్లిన ఉగ్రవాదులు.. వారిలో కొందరిని దారుణంగా హత్య చేశారు. మొత్తంగా దాదాపు 250 మందికిపైగా బందీలుగా చేసుకున్నారు. ఇటీవల కొందరు విదేశీయుల్ని విడిచిపెట్టినప్పటికీ.. ప్రస్తుతం 240 మంది హమాస్‌ చెరలోనే ఉన్నట్లు అంచనా.
 • హమాస్‌ దారుణాలకు ప్రతిఘటనగా అక్టోబర్‌ 8న ఇజ్రాయెల్‌ దాడులు మొదలుపెట్టింది. గాజా ఉత్తర భాగంలోని హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్‌ సైనిక దళాలు.. పూర్తి యుద్ధాన్ని ప్రకటించాయి.
 • గాజాలో 12 వేలకుపైగా హమాస్‌ అనుమానిత స్థావరాలపై దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. కేవలం గడిచిన 24 గంటల్లోనే 450 భవనాలను నాశనం చేసినట్లు తెలిపింది.
 • గాజాపై జరుపుతోన్న ఈ దాడుల్లో దాదాపు 10,022 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 25 వేల మంది గాయాలపాలయ్యారు. వేల మంది ఆచూకీ లేకుండా పోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
 • గాజా సరిహద్దులను ఇజ్రాయెల్‌ దళాలు దిగ్బంధం చేయడంతో.. ఆహారం, ఇంధనం, ఔషధాలు, మంచినీరు, నిత్యవసర సామగ్రి సరఫరా నిలిచిపోయింది. దీంతో గాజా పౌరులు అల్లాడుతున్నారు. సురక్షితంగా భావిస్తోన్న ఆసుపత్రులపైనా దాడులు జరుగుతున్నాయి. తాజాగా శరణార్థి శిబిరాలపైనా ఇజ్రాయెల్‌ సేనలు దాడులు చేస్తుండటంతో తలదాచుకునే పరిస్థితి లేక  సతమతమవుతున్నారు.
 • గాజా ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ గాజాకు అనేక మంది తరలివెళ్లినప్పటికీ.. ఇంకా దాదాపు 3 లక్షల మంది కల్లోలిత ప్రాంతంలో చిక్కుకుపోయినట్లు అంచనా. పాలస్తీనీయన్ల దారుణ పరిస్థితిపై ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 • గాజాలో దాదాపు 50వేల మంది గర్భిణులు సైతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) అంచనా వేసింది. తాజా పరిస్థితులతో వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

 • పాలస్తీనియన్లపై దాడులను ఆపాలని అనేక దేశాలు ఇజ్రాయెల్‌ని డిమాండ్‌ చేస్తున్నాయి. అయినప్పటికీ హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేస్తుండంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని