Ukraine Crisis: ఇప్పటికే ఆరుగుర్ని చంపేశాడట.. రోజుకు 40 మందిని చంపగలడట..!

గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతోన్న సైనిక పోరు రోజురోజుకూ భీకరంగా మారుతూనే ఉంది. ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇరువర్గాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Updated : 12 Mar 2022 15:14 IST

ఉక్రెయిన్‌ పోరులో దిగిన పేరుపొందిన స్నైపర్‌

కీవ్‌: గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతోన్న సైనిక పోరు రోజురోజుకూ భీకరంగా మారుతూనే ఉంది. ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇరువర్గాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా సైనిక శక్తిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ అన్ని మార్గాలను వినియోగించుకుంటోంది. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్‌లలో ఒకరైన వలి.. ఉక్రెయిన్ తరఫున పోరాడేందుకు వచ్చాడు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపుమేరకు బుధవారం వచ్చిన అతడు..రెండు రోజుల్లోనే  ఆరుగురు రష్యా సైనికుల్ని చంపేశాడట..!

ఇంతకీ ఈ వలి ఎవరు..?

ఈ వలి.. ఫ్రెంచ్‌-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్ట్. రాయల్ కెనడియన్ రెజిమెంట్‌లో పనిచేశాడు. వలి అనేది అతడి నిక్‌నేమ్. అరబిక్ భాషలో ఆ పదానికి సంరక్షకుడని అర్థం. తన విధుల్లో భాగంగా అఫ్గాన్‌లో పదుల సంఖ్యలో శత్రువులను మట్టుపెట్టిన క్రమంలో అక్కడి ప్రజలు ఈ పేరు పెట్టారు. ఇక అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, సిరియాలో జరిగిన పోరాటాల సమయంలో అతడి టాలెంట్‌తో గుర్తింపు పొందాడు. కాగా, విదేశీయులు వచ్చి తమకు సహకరించాలని ఇప్పుడు జెలెన్‌స్కీ ఇచ్చిన పిలుపు.. ఆయనకు అలారం బెల్‌లా వినిపించిందట. అందుకే తన భార్య, ఏడాది కూడా నిండని కుమారుడిని వదిలేసి, ఈ యుద్ధంలో దూకేశాడు. వచ్చేవారం అతడి కుమారుడి మొదటి పుట్టిన రోజు జరగనుంది. కానీ ఈ సమయంలో ఉక్రెయిన్‌ ప్రజలకు తన సహాయం అవసరమని వచ్చేశాడు. ‘వీరు ఐరోపా వాసులుగా ఉండాలనుకుంటున్నారు. రష్యన్‌గా ఉండకూడదని అనుకోవడం వల్ల బాంబు దాడులకు గురవుతున్నారు’ అని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇక బుధవారం ఉక్రెయిన్ చేరుకున్న వలి.. ఇప్పటికే ఆరుగురు రష్యన్‌ సైనికుల్ని హతమార్చాడని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్‌గా పేరుపొందిన అతడు.. అత్యధికంగా రోజుకు 40 మందిని మట్టుపెట్టగల సత్తా ఉన్నవాడట. మాములుగా సగటు స్నైపర్‌ రోజుకు 5 నుంచి 6 లక్ష్యాలను చేధించగలడు. అదే ఉత్తమ పనితీరు ప్రదర్శించేవారు రోజుకు 7 నుంచి 10 వరకూ ఛేదిస్తారు. ఇక వలి.. 2017లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐఎస్‌ జిహాదిని కాల్చి చంపాడు. ఇంత సుదీర్ఘ దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించడంలో అతడిదే రికార్డు.

ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 24న ప్రత్యేక సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన దాడికి రెండు వారాలు దాటిపోయింది. ఈ క్రమంలో ఇరువైపులా ప్రాణనష్టం సంభవిస్తోంది. నివాస భవనాలు, ఆసుపత్రులు అనే తేడా లేకుండా రష్యా అన్నింటిపైనా దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఉక్రెయిన్‌ వాసులు ప్రాణాలు అరచేతపట్టుకొని.. పొరుగు దేశం పంచన చేరాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని