Oral Covid vaccine: నోటిద్వారా టీకా.. రక్షణతోపాటు వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట

నోటి ద్వారా తీసుకునే టీకా వ్యాధి నుంచి రక్షణ కల్పించడంతోపాటు గాలిలో వైరస్‌ వ్యాప్తిని తగ్గించడంలోనూ దోహదపడుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 10 May 2022 02:22 IST

మెరుగైన ఫలితాలు వచ్చాయన్న పరిశోధకులు

వాషింగ్టన్‌: ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌ను నిరోధించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఉన్న టీకాలు ఇంజెక్షన్‌ల రూపంలో ఉండగా.. నోటిద్వారా తీసుకునే టీకాపైనా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నోటి ద్వారా తీసుకునే టీకా వ్యాధి నుంచి రక్షణ కల్పించడంతోపాటు గాలిలో వైరస్‌ వ్యాప్తిని తగ్గించడంలోనూ దోహదపడుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ను అమెరికాలోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థ వాక్సార్ట్‌, లవ్‌లేస్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థలు రూపొందించాయి. దీనిని జంతువులపై ప్రయోగించగా వాటి రక్తం, ఊపిరితిత్తుల్లో యాంటీబాడీ ప్రతిస్పందనలు గణనీయంగా ఉన్నట్లు గుర్తించారు. వైరస్‌ సోకని వాటితో పోలిస్తే వైరస్‌కు గురైన వాటిల్లో లక్షణాలు కూడా తక్కువగానే ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా వైరస్‌ను శ్వాసమార్గంలోనే అడ్డుకోవడం వల్ల దగ్గు, తుమ్ము ద్వారా వైరస్‌ గాలిలో చేరడం తగ్గించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతున్నప్పటికీ పిల్లలకు తేలికగా అందించేందుకు ఈ తరహా వ్యాక్సిన్‌ ఎంతగానో దోహదపడుతుందని పరిశోధనలో పాల్గొన్న అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ నిపుణులు స్టిఫేనీ ఎన్‌ లాంగెల్‌ పేర్కొన్నారు. వీటిద్వారా కేవలం వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే కాకుండా తీసుకోని వారికి పరోక్ష రక్షణ కలుగుతుందన్నారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు ఒరిజినల్‌ వైరస్‌పైనే చేపట్టామని.. తదుపరి ప్రయోగాలను ఒమిక్రాన్‌ వంటి వేరియంట్లపై జరుపుతామని పరిశోధకులు వెల్లడించారు.

ఇదిలాఉంటే, నోటిద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌పై భారత్‌తోపాటు పలు దేశాల్లో ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంజక్షన్‌ భయం ఉన్నవారితో పాటు చిన్నారులకు తేలికగా వ్యాక్సిన్‌ అందించేందుకు నోటి ద్వారా తీసుకునే టీకాను త్వరగా అందుబాటులోకి తేవడానికి ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు