Osama bin Laden: 9/11 తర్వాత అమెరికాపై మరో దాడికి కుట్ర పన్నిన లాడెన్‌..!

రెండు దశాబ్దాల క్రితం అగ్రరాజ్యం అమెరికా ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలోని అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్‌ చేసి మారణహోమం సృష్టించారు. వేల మందిని బలి తీసుకున్నారు.

Published : 26 Apr 2022 01:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు దశాబ్దాల క్రితం అగ్రరాజ్యం అమెరికా ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలోని అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్‌ చేసి మారణహోమం సృష్టించారు. వేల మందిని బలి తీసుకున్నారు. అయితే ఈ 9/11 దాడులు జరిగిన తర్వాత అమెరికాపై మరో భీకర దాడికి లాడెన్‌ కుట్రలు పన్నినట్లు తాజాగా బయటపడింది. ప్రైవేటు జెట్లను ఉపయోగించడంతో పాటు రైలు పట్టాలను తొలగించి వందల మందిని చంపేయాలని పథకం రచించినట్లు తెలిసింది.

2011లో లాడెన్‌ హత్య అనంతరం లభించిన కీలక పత్రాలను యూఎస్‌ నేవీ సీల్‌ భద్రపర్చింది. ఆ పత్రాల్లో కొన్ని సంచలన విషయాలు బయటపడినట్లు సీబీఎస్‌ న్యూస్‌ తమ కథనంలో వెల్లడించింది. 11 ఏళ్ల క్రతం లాడెన్‌పై ఆపరేషన్‌ చేపట్టిన అమెరికా నేవీ సీల్‌ బృందం తీసుకొచ్చిన వందలాది పత్రాలను ఇస్లామిక్‌ స్కాలర్‌ నెల్లీ లాహౌద్‌ అధ్యయనం చేశారు. ఆ వివరాలను ఇటీవల సీబీఎస్‌ న్యూస్‌తో పంచుకున్నారు. అందులో లాడెన్‌ తమ బృంద సభ్యులకు రాసిన వ్యక్తిగత లేఖలు కూడా ఉన్నట్లు చెప్పారు.

‘‘9/11 దాడి తర్వాత అమెరికన్ల స్పందన చూసి లాడెన్‌ ఆశ్చర్యపడినట్లు ఆ లేఖల ద్వారా తెలిసింది. దాడుల అనంతరం అమెరికన్‌ ప్రజలు వీధులపైకి చేరి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతారని అతడు భావించాడు. కానీ, లాడెన్‌ లెక్క తప్పింది. ఇక, దాడుల తర్వాత మూడేళ్ల పాటు లాడెన్‌ పరారీలో ఉన్నాడు. ఆ సమయంలో అల్‌ఖైదా సభ్యులతోనూ అతడు టచ్‌లో లేడు. 2004లో మళ్లీ తన ఉగ్ర ముఠాకు చేరువైన లాడెన్‌.. అమెరికాపై మరో దాడికి కుట్రలు పన్నాడు. అయితే 9/11 దాడి తర్వాత ఎయిర్‌పోర్టుల్లో భద్రతను పెంచడంతో మళ్లీ అలాంటి దాడులు కష్టమని భావించాడు. అందుకే ఈసారి ఛార్టర్ విమానాలను ఉపయోగించాలని అల్‌ఖైదా అంతర్జాతీయ యూనిట్‌కు సూచించాడు. అదీ కుదరకపోతే అమెరికా రైల్వేలను లక్ష్య్ంగా చేసుకోవాలని ఓ లేఖలో పేర్కొన్నాడు’’ లాహౌద్‌ వెల్లడించారు.

‘‘సివిల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన లాడెన్‌.. రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని ఎలా దాడులు చేయాలో వివరించాడు. 12 మీటర్ల స్టీల్‌ రైలు పట్టాలను తొలగించాలని చెప్పాడు. అప్పుడు ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లు పట్టాలు తప్పి కనీసం వందల మంది చనిపోయే ఆస్కారం ఉందని ముఠా సభ్యులకు సూచించాడు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రణాళికను అతడు ఎన్నడూ అమలు చేయలేదు. మరోవైపు, 2010లో మధ్య పాశ్చ్య, ఆఫ్రికా దేశాల్లో ముడి చమురు ట్యాంకర్లు, షిప్పింగ్‌ మార్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని కుట్రలు పన్నాడు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టాలని లాడెన్‌ పథకం రచించాడు’’ అని లాహౌద్‌ చెప్పుకొచ్చారు.

2001 సెప్టెంబరు 11న అమెరికాలో అల్‌ఖైదా ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. ప్రయాణికుల విమానాలను హైజాక్‌ చేసి ట్విన్‌ టవర్లను కూల్చేశారు. ఈ భీకర దాడిలో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడికి అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. 2011లో పాకిస్థాన్‌లోని అట్టోబాబాద్‌లో మెరుపు దాడులు జరిపి లాడెన్‌ను హతమార్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని