Iran Protests: ప్రభుత్వ అణచివేతపై నిరసనగళం.. ‘ఆస్కార్‌’ సినిమా నటి అరెస్టు!

దేశంలో కొనసాగుతోన్న ఆందోళనలకు మద్దతు పలికిన ప్రముఖ ఇరానియన్‌ నటి తారానేహ్‌ అలీదూస్తిని ప్రభుత్వం తాజాగా అరెస్టు చేసింది. 2016లో ఆస్కార్ సాధించిన ‘ది సేల్స్‌మన్‌’ చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

Published : 18 Dec 2022 12:49 IST

టెహ్రాన్‌: దేశంలో మూడు నెలల నుంచి కొనసాగుతోన్న హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనల(Iran Protests)పై ఇరాన్‌ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఇద్దరికి ఉరి శిక్ష అమలు చేసిన ప్రభుత్వం.. అనేక మందికి జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఇరానియన్‌ నటి తారానేహ్‌ అలీదూస్తి(Taraneh Alidoosti)ని అరెస్టు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ఆమె సంఘీభావం తెలపడమే దానికి కారణం. హిజాబ్‌ ఆందోళనల విషయంలో అబద్ధాలను వ్యాప్తి చేశారన్న ఆరోపణలపై పోలీసు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

టెహ్రాన్‌లో నిరసనల్లో పాల్గొన్న మొహసెన్‌ షెకారీ అనే యువకుడిని ఇరాన్‌ ఇటీవల ఉరి తీసింది. అలీదూస్తీ దీన్ని తీవ్రంగా ఖండించారు. దీంతోపాటు అతని ఉరిశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పకపోవడంపై అంతర్జాతీయ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. ‘ఈ రక్తపాతాన్ని చూస్తూ స్పందించని ప్రతి అంతర్జాతీయ సంస్థ.. మానవత్వానికే మాయని మచ్చ’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విమర్శించారు. అయితే, 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇటీవల తొలగించడం గమనార్హం.

38 ఏళ్ల అలీదూస్తి ఇరాన్‌లో పేరొందిన నటీమణుల్లో ఒకరు. 2016లో ఆస్కార్ పురస్కారం సాధించిన ‘ది సేల్స్‌మన్‌(The Salesman)’ చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటించారు. దేశవ్యాప్త నిరసనలను అణచివేసేందుకు ఇరాన్‌ చేస్తున్న ప్రయత్నాలను మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహ్సా అమీని మరణంతో దేశంలో ఆందోళనలు ఎగసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అమీని మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని