Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్‌ స్ట్రీమింగ్‌!

బెన్ను గ్రహశకలం ఉపరితలం నుంచి ఓసిరిస్‌ రెక్స్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ (OSIRIS-REx Mission) నమూనాలు సేకరించిన విషయం తెలిసిందే. వాటి గుట్టు విప్పే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.

Published : 28 Sep 2023 02:10 IST

Image : Astromaterials

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఓసిరిస్‌ రెక్స్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ (OSIRIS-REx Mission) సాయంతో బెన్ను (Bennu) గ్రహశకలం నుంచి దుమ్ము, గులకరాళ్ల నమూనాలను నాసా ఇటీవల భూమి పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శాస్త్రవేత్తలు వాటి గుట్టు విప్పే పనిలో పడ్డారు. ఓసిరిస్‌ రెక్స్‌ ఏవియానిక్స్‌ డెక్‌లో నల్లటి దుమ్ము, శిథిలాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ తరువాత నమూనాలు తీసుకొచ్చిన పరికరంపై ఉన్న ప్రాథమిక మూతను తొలగించినట్లు  నాసా (NASA) పేర్కొంది. స్పేస్‌క్రాఫ్ట్‌ ఆదివారం యుటా ఎడారిలో ల్యాండ్‌ అయ్యింది. దానిని హ్యూస్టన్‌లోని నాసాకు చెందిన జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు. శకలాల నమూనాలు, వాటిని సురక్షితంగా భద్రపరిచే నిపుణుల బృందం ఇక్కడ ఉంటుంది. క్యాప్సుల్‌ నుంచి టచ్‌ అండ్‌ గో శాంపిల్‌ అక్విజిషన్‌ మెకానిజం (ట్యాగ్‌సమ్‌)ను విడదీసేందుకు పరిశోధకులు విస్తృతంగా కృషి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ల్యాబ్‌ను సిద్ధం చేశారు. తాజాగా అల్యూమినియం మూతను ఓ భారీ గ్లోవ్‌బాక్స్‌లో ఉంచి తొలగించినట్లు నాసా పేర్కొంది. 

ముగిసిన సుదీర్ఘ అంతరిక్ష యాత్ర.. క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు!

ట్యాగ్‌సమ్‌ను క్యాన్‌స్టర్‌ నుంచి పూర్తిగా విడదీసిన తర్వాత దాన్ని సీల్డ్‌ ట్రాన్స్‌ఫర్‌ కంటైనర్‌లోకి మార్చుతారు. అందులో దాదాపు రెండుగంటలపాటు నైట్రోజన్‌ వాయువుతో కూడిన వాతావరణం ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ మరో ప్రత్యేకమైన గ్లోవ్‌బాక్సులోకి మారుస్తారు. దాంతో నమూనాలను వేరు చేసే ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కొన్ని నెలలు సాధన చేశారు. బెన్ను గ్రహశకలం నుంచి తీసుకొచ్చిన నమూనాలను అక్టోబరు 11న బయటి ప్రపంచానికి చూపించే అవకాశం ఉంది. ఆ ఘట్టాన్ని నాసా వెబ్‌సైట్‌  ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

2016లో నాసా ‘ఓసిరిస్‌- రెక్స్‌ (OSIRIS-REx)’ అనే మిషన్‌ను ప్రయోగించింది. 2020లో అది బెన్ను గ్రహశకలం ఉపరితలం నుంచి దుమ్ము, రాళ్లను సేకరించింది. అనంతరం భూమి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే భూమికి లక్ష కిలోమీటర్ల దూరంలో వ్యోమనౌక నుంచి విడిపోయిన క్యాప్స్యూల్‌.. నాలుగు గంటల తర్వాత భూమిని చేరుకుంది. అగ్ర రాజ్యానికి చెందిన ‘నాసా (NASA)’.. ఓ గ్రహశకలం నమూనా (Asteroid Samples)లు సేకరించి, భూమి పైకి తీసుకురావడం ఇదే మొదటిసారి. అంతకుముందు జపాన్‌ మాత్రమే ఈ విధంగా గ్రహశకలానికి చెందిన నమూనాలను భూమి మీదికి తీసుకొచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు