Russia: పుతిన్‌ పిలుపు.. ఆర్మీలో చేరిన 2 లక్షల మంది పౌరులు!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పిలుపు మేరకు 2 లక్షల మంది పౌరులు సైన్యంలో చేరినట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి సెర్గేయ్‌ షోయిగు తెలిపారు. వీరందర్నీ వీలైనంత త్వరగా పోరాటానికి సిద్ధం చేయాలని ఆర్మీ, నేవీ కమాండర్లను ఆయన ఆదేశించారు.

Published : 05 Oct 2022 02:05 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా తన సైన్యాన్ని పటిష్ఠం చేసుకునేందుకు నిర్బంధ సైనిక సమీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం గతంలో సైనిక శిక్షణ తీసుకున్న వారే కాకుండా వివిధ వర్గాల పౌరులు కూడా రష్యన్‌ ఆర్మీలో చేరాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 2 లక్షల మంది ఆర్మీలో చేరినట్లు రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గేయ్‌ షోయిగు మంగళవారం తెలిపారు. ‘‘ పుతిన్‌ పిలుపు మేరకు ఇప్పటి వరకు 2 లక్షల మంది పౌరులు ఆర్మీలో చేరారు’’ అని సెర్గేయ్‌ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా కూడా అధిక మొత్తంలోనే సైనికులను కోల్పోతోంది. దీంతో నిర్బంధ సైనిక సమీకరణ ద్వారా కనీసం 3 లక్షల మంది సైనికులను పోగు చేయాలని భావిస్తోంది. వీరందరినీ బృందాలుగా విభజించి 80 ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 6 శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు నిర్బంధ సైనిక సమీకరణపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు యువకులు దేశం విడిచి పారిపోతున్నారు. గడిచిన రెండు వారాల్లో దాదాపు 2 లక్షల మంది రష్యా పౌరులు సరిహద్దులు దాటి తమ దేశంలో ప్రవేశించినట్లు ఖజకిస్థాన్‌ వెల్లడించింది.

సైనిక సమీకరణ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేసి, వారిని పోరాటానికి సిద్ధం చేయాలని మిలటరీ, నేవీ కమాండర్లకు రక్షణ మంత్రి సెర్గేయ్‌ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అదనపు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. శిక్షణ పూర్తయితేనే వారిని రంగంలోకి దించగలమన్నారు. మరోవైపు రైతులను కూడా సైన్యంలో భాగం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా పలు దేశాలు ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న వేళ.. తాజా నిర్ణయం దీనికి మరింత ఆజ్యం పోసే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని