Ship: రెండు ముక్కలైన నౌక.. 24 మందికిపైగా సిబ్బంది గల్లంతు!

దక్షిణ చైనా సముద్రంలో తుపాను ధాటికి శనివారం ఓ భారీ నౌక రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో అందులోని దాదాపు 24మంది సిబ్బంది గల్లంతయ్యారు........

Published : 02 Jul 2022 20:51 IST

హాంకాంగ్‌: దక్షిణ చైనా సముద్రంలో తుపాను ధాటికి శనివారం ఓ భారీ నౌక రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో అందులోని దాదాపు 24మంది సిబ్బంది గల్లంతయ్యారు. స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. హాంకాంగ్‌కు నైరుతి దిశగా 160 నాటికల్‌ మైళ్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఓ ఇంజినీరింగ్‌ నౌక.. చబా తుపాను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తీవ్రస్థాయిలో దెబ్బతింది. ఈ క్రమంలోనే అది రెండు ముక్కలై.. నీట మునిగింది. అప్పటికే అప్రమత్తమైన 30 మంది సిబ్బంది నౌక నుంచి బయటకుదూకారు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాప్టర్‌ సాయంతో ముగ్గురిని రక్షించి, వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతావారి ఆచూకీ తెలియరాలేదని, వారిని కనుగొనేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే, మొదటి హెలికాప్టర్ రాకముందే వారు అలల ధాటికి కొట్టుకుపోయి ఉండొచ్చని ప్రాణాలతో బయటపడిన ఆ ముగ్గురు పేర్కొన్నారు.

దక్షిణ చైనా సముద్రం మధ్య భాగంలో ఏర్పడిన  తుఫాను.. శనివారం మధ్యాహ్నం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తీరాన్ని తాకింది. హాంకాంగ్‌లోని అధికారులకు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:25 గంటలకు ఈ ప్రమాదం గురించి సమాచారం అందింది. అయితే, ఘటనాస్థలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బలమైన ఈదురు గాలుల కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌ కష్టతరంగా మారుతోందని అధికారులు తెలిపారు. నౌక నీటమునిగిన ప్రదేశంలో గంటకు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, 10 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఫ్లయింగ్ సర్వీస్ రెండు రకాల ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను, నాలుగు హెలికాప్టర్లను పంపింది. చైనా అధికారులు కూడా రెస్క్యూ బోట్‌ను పంపారు. గల్లంతైనవారి సంఖ్య భారీగానే ఉండటంతో.. అన్వేషణ ప్రాంత పరిధిని పెంచుతామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని