Earthquake: వేల సంఖ్యలో మృతదేహాలు.. సమాధులు తవ్వేందుకు పొక్లెయిన్లు..!

తుర్కియే(Turkey), సిరియా(Syria)లో సంభవించిన భూకంపంలో 35 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిని సమాధి చేసేందుకు అడవులను నరకాల్సిన దుస్థితి నెలకొనడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

Updated : 13 Feb 2023 16:20 IST

అంకారా: తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంపం సృష్టించిన విలయం.. ఎన్నో దయనీయ దృశ్యాలను కళ్లముందుంచుతోంది. ఇప్పటికే వారం గడవడం, గడ్డకట్టే చలి కావడంతో కుటుంబసభ్యులు తమ వారి ప్రాణాలపై నమ్మకం కోల్పోతున్నారు. అయినా ఎక్కడో చిన్న ఆశతో ఎదురుచూసిన వారికి కన్నీరే మిగులుతోంది. దాంతో మృతుల సంఖ్య వేలకు వేలు పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఒకే దగ్గర భారీ సంఖ్యలో మృతదేహాలను ఖననం చేస్తున్నారు. 

ఆదివారం నాటికి తుర్కియే(Turkey)లోని మరాష్ ప్రాంతంలో  దాదాపు 5 వేల మృతదేహాలను ఒకే ప్రాంతంలో సమాధి చేశారు. శవాలను మోసుకొచ్చే వాహనాల శబ్దం వినిపిస్తూనే ఉందని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. తమ వారిని ఖననం చేసేందుకు వచ్చినవారి రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. శ్మశాన వాటిక కోసం పైన్ అడవులను కొట్టివేశారు. ఇక సమాధులను తవ్వేందుకు బుల్డోజర్లు, పొక్లెయిన్లు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. చనిపోయిన వారిని సంప్రదాయబద్ధంగా పంపించాలని అయినవారు కోరుకుంటున్నారు. ఆ నిమిత్తం అధికారులు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. అక్కడ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. 

మరోసారి ప్రకంపనలు.. 35 వేలకు మృతులు

ఈ రెండు దేశాల్లో సంభవించిన భూకంప ధాటికి ఇప్పటివరకూ 35 వేల మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక తుర్కియే(Turkey )లోని మరాష్‌కు సమీపంలో ఆదివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని