UKraine Crisis: రష్యా ఒలిగార్క్‌లూ.. యూఏఈకి స్వాగతం..!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధభేరీ మోగించడం.. మాస్కోలోని ఒలిగార్క్‌లకు కష్టాలను తీసుకొచ్చింది. పశ్చిమ దేశాలు క్రెమ్లిన్‌కు సన్నిహితంగా ఉండే సంపన్నుల ఆస్తులను సీజ్‌ చేయడం.. ఆంక్షలు విధించడం వంటివి చేస్తున్నాయి. దీంతో వారు విదేశాల్లోని

Updated : 29 Apr 2022 13:44 IST

 తెరవెనుక చక్రం తిప్పుతున్న యువరాజు 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధభేరీ మోగించడం.. మాస్కోలోని ఒలిగార్క్‌లకు కష్టాలను తీసుకొచ్చింది. పశ్చిమ దేశాలు క్రెమ్లిన్‌కు సన్నిహితంగా ఉండే సంపన్నుల ఆస్తులను సీజ్‌ చేయడం.. ఆంక్షలు విధించడం వంటివి చేస్తున్నాయి. దీంతో వారు విదేశాల్లోని తమ ఆస్తులను తటస్థ దేశాల్లో సురక్షిత స్థానాలకు తరలించే పనిలో ఉన్నారు. పలు తటస్థ దేశాలు ఉన్నా.. వారు యూఏఈ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వారి సంపదకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరాట్స్‌ కేరాఫ్‌గా మారుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో యూఏఈ రాజకుటుంబానికి చెందిన యువరాజు ఒకరు చక్రం తిప్పుతున్నారు. పశ్చిమ దేశాల ఆధిపత్యంలోని ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రేలిస్టులో ఉన్నా.. యూఏఈ వెనుకాడకుండా రష్యన్‌ సంపదకు ఆశ్రయమివ్వడం విశేషం. 

యూఏఈ రాజకుటుంబంలో షేక్‌ మన్‌సౌర్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ పేరు ఫుట్‌బాల్‌ ప్రేమికులకు సుపరిచితమే. ఆయన ఇంగ్లిష్‌ లీగ్‌ జట్టు మాంచెస్టర్‌ యజమాని. యూఏఈలో డిప్యూటీ ప్రధాని బాధ్యతలను పోషిస్తున్నారు. రాయల్‌ ఫ్యామిలీలో శక్తిమంతమైన సభ్యుడిగా ఈయన్ను భావిస్తారు. ఆయన ఇటీవల కాలంలో రష్యా ఒలిగార్క్‌ల సంపదను యూఏఈకి తరలించడానికి సాయం చేస్తున్నారు. ఈ విషయాన్ని అబుదాబీ రాజకుటుంబానికి చెందిన సన్నిహితులు బ్లూమ్‌బెర్గ్‌ పత్రికకు వెల్లడించారు.

షేక్‌ మన్‌సౌర్‌ గత కొన్నేళ్లుగా రష్యాతో మంచి సంబంధాలు నెరుపుతున్నారు. తాజాగా ఉక్రెయిన్‌ సంక్షోభంతో వారి బంధం మరింత బలపడింది. అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు రష్యాపై వేల కొద్దీ ఆర్థిక ఆంక్షలను విధించాయి. కానీ, అమెరికా మిత్ర దేశమైన యూఏఈ మాత్రం మాస్కోపై ఎటువంటి ఆంక్షలను విధించలేదు. అంతేకాదు.. అబుదాబీ అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుంది కానీ.. ఏవో కొన్ని దేశాలు విధించిన ఆంక్షలను పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. రష్యా, యూఏఈలు ఒపెక్‌+ బృందంలో సభ్యులు.

విలాసవంతమైన పెంట్‌ హౌస్‌లు.. కార్ల కొనుగోళ్లు..

షేక్‌ మన్‌సౌర్‌ ఆఫీస్‌కు రష్యా సంపన్నుల తాకిడి పెరిగింది. యూఏఈలో ప్రభుత్వ నిబంధనలు పాటించడంలో సాయం కోసం వీరు వస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు రష్యా నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నారు. మరికొందరు దుబాయ్‌లోని పెంట్‌ హౌసలు కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు అక్కడ విలాసవంతమైన వస్తువుల షాపింగ్‌ చేస్తున్నారు. దీంతోపాటు దుబాయ్‌లో బ్యాంక్‌ ఖాతాలను తెరుస్తున్నారు. షేక్‌ మన్‌సౌర్‌ కార్యాలయ సిబ్బంది వీరికి సాయం చేస్తున్నారు. ప్రపంచం నలు మూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలనే వ్యూహాంలో భాగంగానే రష్యన్లకు దుబాయ్‌లో స్వాగతం లభిస్తోంది. దీనిపై యూఏఈకి చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ అఫైర్స్‌, విదేశాంగ శాఖ నోరు మెదపడంలేదు. కాకపోతే మనీలాండరింగ్‌ విషయంలో మాత్రం అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని యూఏఈ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీస్‌ ప్రతినిధి వెల్లడించారు. 2022 తొలి రెండు నెలల్లో 1,37,000 మంది రష్యన్లు యూఏఈని సందర్శించారు. అత్యధికంగా యూఏఈకి సందర్శకులు వెళ్లే దేశాల్లో రష్యాది నాలుగో స్థానం.

అమెరికా ఆందోళన..

మిత్రదేశమైన యూఏఈనే తమ ఆంక్షలకు తూట్లు పొడవడంపై పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నెల మొదట్లో అమెరికా డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ వాల్లీ ఆడ్మె యూఏఈ అధికారులకు ఫోన్‌ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా సంపన్నులు ఆస్తులను యూఏఈకి తరలించడంపై వాషింగ్టన్‌ ఆందోళన చెందుతోందని వెల్లడించారు.  మరో వైపు యూఏఈ కూడా రష్యా-అమెరికా మధ్య సమతౌల్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకొంటోంది. అమెరికా పెట్టుబడులు ఎక్కువగా ఉన్న మొబుదాల ఇన్వెస్ట్‌మెంట్‌ కో నుంచి రష్యాలో ఎటువంటి పెట్టుబడులు పెట్టమని దాని సీఈవో అల్‌ ముబారక్‌ వెల్లడించారు. ఈ ఫండ్‌కు షేక్‌ మన్‌సౌర్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

యూఏఈ పాలకుడికి చేదోడు వాదోడు షేక్‌ మన్‌సౌర్‌..

యూఏఈ అప్రకటిత పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌(ఎంబీజెడ్‌)కు మన్‌సౌర్‌ సోదరుడు అవుతాడు. ఉక్రెయిన్‌ ఆక్రమణకు ముందు ఎంబీజెడ్‌ పుతిన్‌తో భేటీ అయిన సమయంలో మన్‌సౌర్‌ కూడా అక్కడే ఉన్నారు. రష్యా సంస్థలతో సమావేశాల్లో మన్‌సౌర్‌ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇతడు యూఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, యూఏఈ చమురు సంస్థ అడ్నోక్‌ బోర్డుల్లో సభ్యుడు. ఆయన కనుసన్నల్లో 800 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యాపారాలు ఉన్నాయి. ఇక 2008లో మాంచెస్టర్‌ ఫుట్‌బాల్‌ జట్టును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ జట్టు రూపు రేఖలే మారిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన జట్టుగా దీనిని తీర్చిదిద్దాడు.

వేలాడుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ కత్తి..

యూఏఈ ఇటీవలే ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో చేరింది. తాజాగా రష్యా సంపదకు ఆశ్రయం ఇస్తోంది. కానీ, ఈ క్రమంలో అవసరమైన కఠిన తనిఖీలు నిర్వహించే ఆ సంపదను ఆహ్వానిస్తామని ఆ దేశం చెబుతోంది. వాస్తవానికి హుతీ రెబల్స్‌ క్షిపణి దాడుల నుంచి కాపడటానికి అమెరికా చేయాల్సినంత కృషి చేయడం లేదని యూఏఈ, సౌదీ అరేబియా గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చమురు ఉత్పత్తి పెంచాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాయి. తాజాగా రష్యన్ల సంపదను స్వీకరించేందుకు ముందుకు రావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని