Genocide: పాక్‌ దారుణాలను ‘మారణహోమం’గా గుర్తించాలి.. అమెరికా చట్టసభలో తీర్మానం

1971లో బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధ సమయంలో పాకిస్థాన్ సేనలు.. అక్కడి బెంగాలీలు, హిందువులపై జరిపిన సామూహిక అకృత్యాలను ‘మారణహోమం’గా గుర్తించాలని అమెరికా చట్టసభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రతినిధుల సభలో తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Published : 16 Oct 2022 01:19 IST

వాషింగ్టన్: 1971లో బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధ సమయంలో పాకిస్థాన్ సేనలు.. అక్కడి బెంగాలీలు, హిందువులపై జరిపిన సామూహిక అకృత్యాలను ‘మారణహోమం(Genocide)’గా గుర్తించాలని అమెరికా చట్టసభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్‌ను కోరుతూ.. అమెరికా(America) ప్రతినిధుల సభలో తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చట్టసభ్యులైన భారతీయ- అమెరికన్ రో ఖన్నా, సెవ్ చబాట్‌లు ఈ తీర్మానాన్ని రూపొందించారను. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రజలకు పాకిస్థాన్‌ క్షమాపణలూ చెప్పాలంటూ తీర్మానంలో పేర్కొన్నారు.

‘అప్పటి తూర్పు పాకిస్థాన్‌(నేటి బంగ్లాదేశ్‌)లో 1971 నాటి మారణహోమాన్ని మరచిపోకూడదు. లక్షల మంది అమాయక ప్రజలు హత్యకు గురయ్యారు. అందులో 80 శాతం మంది హిందువులే! ఈ నేపథ్యంలో.. దురాగతాల జ్ఞాపకాలను కాలం చెరిపేయకుండా చూసుకోవాలి. మారణహోమాలను గుర్తించడం.. చరిత్రను బలోపేతం చేయడమేకాకుండా ప్రజలను జాగృతపరుస్తుంది. ఇటువంటి దారుణాలను మరచిపోమని, వాటిని సహించేది లేదన్న హెచ్చరికలను.. సంబంధిత వ్యక్తులకు, దేశాలకు చేరవేస్తుంది’ అని రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడు చబాట్‌ వ్యాఖ్యానించారు.

‘హోలోకాస్ట్‌ మాదిరే బంగ్లాదేశ్‌లో జరిగిన అరాచకాలూ ఓ మారణహోమమే. అయితే, నిర్వచనం ప్రకారం దీన్ని ఇప్పటివరకు ఈ విధంగా గుర్తించలేదు. మేం ఇప్పుడు దీనిపై కసరత్తు చేస్తున్నాం’ అని చబాట్‌ తెలిపారు. డెమొక్రాట్‌ ప్రజాప్రతినిధి రో ఖన్నా స్పందిస్తూ.. ఆధునిక కాలంలో మరచిపోయిన మారణహోమాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. ఇందులో మిలియన్ల మంది బెంగాలీలు, హిందువులు ఊచకోతకు గురయ్యారని, వలసలు వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే చబాట్‌తో కలిసి ఈ మేరకు మొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన’ట్లు ట్వీట్ చేశారు.

బంగ్లాదేశ్‌ సమాజం ఈ తీర్మానాన్ని స్వాగతించింది. ఎట్టకేలకు అమెరికా చట్టసభలో దీన్ని గుర్తిస్తున్నారని.. 1971 నాటి ఘటనల్లో తన కుటుంబాన్ని కోల్పోయిన సలీం రెజా నూర్‌ అనే వ్యక్తి స్పందించారు. ఈ చరిత్రాత్మక తీర్మానం విషయంలో రిపబ్లికన్‌లు, డెమొక్రాట్‌లు ఏకతాటిపై నిలవడం హర్షనీయమన్నారు. బంగ్లాదేశ్ మైనారిటీల మానవ హక్కుల కాంగ్రెస్(HRCBM) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియా సాహా మాట్లాడుతూ.. ఆనాటి ఘటనల్లో బలైపోయిన లక్షలాది మంది స్మృతులకు అధికారికంగా గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ ఎంపీ అరోమా దత్తా.. అప్పట్లో తమ కుటుంబంపై జరిగిన ఘోరాలను గుర్తుచేసుకున్నారు. వృద్ధులు, యువతులు, చిన్నారులతోసహా అమాయక ప్రజలను హత్య చేసిన వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని