Pakistan: ఆత్మాహుతి దాడిలో 93కు పెరిగిన మృతులు.. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఘటన

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌(Pakistan) ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 

Updated : 31 Jan 2023 13:45 IST

పెషావర్‌: పాకిస్థాన్‌(Pakistan)లోని పెషావర్‌(Peshawar)లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ 93 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడిలో శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలను వెలికి తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

పెషావర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్‌ లైన్స్‌లోని ఓ మసీదులో సోమవారం మధ్యాహ్నం ఆత్మాహుతి దాడి జరిగింది. ‘ఈ రోజు కూడా శిథిలాలను తొలగిస్తున్నాం. కానీ ఎవరూ సజీవంగా ఉంటారన్న ఆశ మాత్రం లేదు’ అని సహాయక చర్యలు చేపడుతోన్న అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పెషావర్‌ ఆసుపత్రి అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఏ ఉగ్రముఠా నుంచి కూడా ప్రకటన వెలువడలేదు. ‘పాకిస్థాన్ పరిరక్షణ కోసం పాటుపడుతోన్న వారిని లక్ష్యంగా చేసుకొని, ఉగ్రవాదులు భయాన్నిసృష్టించాలని అనుకుంటున్నారు’ అని ప్రధాని షహబాజ్ షరీఫ్‌ మండిపడ్డారు. 

సోమవారం యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE)అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆ పర్యటన కాస్తా రద్దయింది. అలాగే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పాక్‌.. మంగళవారం అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు