Pakistan: పాక్‌లో ముదురుతున్న సంక్షోభం.. మంత్రులపై వేటు, ఉద్యోగాల్లో కోత..!

పాక్‌(Pakistan) మరిన్ని పొదుపు చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థికంగా కుంగిపోతున్న ఆ దేశం.. డబ్బును ఆదా చేసే మార్గాల వైపు మొగ్గుచూపుతోంది. 

Published : 26 Jan 2023 01:34 IST

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌(Pakistan) ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మూడు వారాలకు సరిపడా విదేశీ మారకద్రవ్యం మాత్రమే అందుబాటులో ఉంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఖర్చులు తగ్గించుకునే దిశగా షెహబాజ్‌ షరీఫ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  ఈ మేరకు ప్రధాని షరీఫ్ ఏర్పాటు చేసిన జాతీయ పొదుపు కమిటీ(National Austerity Committee) కొన్ని పరిశీలనలు చేసింది. 

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించాలనే ప్రతిపాదనను ఆ కమిటీ ప్రధానికి ప్రతిపాదించే యోచనలో ఉంది. అలాగే మంత్రిత్వ శాఖలు, వాటి సంబంధిత విభాగాల ఖర్చుకు 15 శాతం కోత పెట్టాలని యోచిస్తున్నట్లు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది. అంతేగాకుండా మంత్రుల సంఖ్యను 78 నుంచి 30కి తగ్గించాలని,సలహాదారుల సంఖ్యనూ కుదించాలని పరిశీలిస్తోంది. ఆ మిగిలిన వారు స్వచ్ఛందంగా పనిచేయాలట. ఇక ఈ ప్రతిపాదనలను కమిటీ బుధవారం నాటికి ఫైనల్ చేస్తుందని, వాటిని ప్రధానికి పంపుతుందని ఆ వార్తా కథనం పేర్కొంది. 

ఆర్థిక కష్టాల నుంచి కాస్త బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ఆదుకోవాలని పాక్‌ ఎదురుచూస్తోంది. కానీ ఆ సంస్థ పెట్టే నిబంధనలను పాటించేందుకు మాత్రం విముఖతతో ఉంది. ఇది రెండున్నర నెలలుగా ఐఎంఎఫ్, పాక్‌ మధ్య ప్రతిష్ఠంభనకు దారితీస్తోంది. ఆర్థిక ఇక్కట్లు పడుతోన్న పాక్‌.. ఇప్పటికే పలు పొదుపు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా కరెంటు కోతలు విధిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల పనివేళలను కుదించడంతోపాటు మాల్స్‌, ఫ్యాక్టరీలు కూడా తొందరగా మూసివేయాలని ఆదేశించింది. రాత్రివేళల్లో వేడుకలపైనా నిషేధం విధించింది. పాలకుల అవినీతి, కరోనా, ప్రకృతి విపత్తులు ఆ దేశాన్ని కుంగదీశాయి. ఈ ప్రభావం అక్కడి సామాన్యులపై పడింది. దాంతో అక్కడ గోధుమ పిండి కోసం తొక్కిసలాటలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు