Pakistan: పోలీసులను చూసి పరుగులు పెట్టిన పాక్‌ మాజీ మంత్రి.. వీడియో వైరల్‌

పాకిస్థాన్‌ (Pakistan)లో ఓ మాజీ మంత్రి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు ప్రాంగణంలో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Published : 16 May 2023 18:47 IST

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) అరెస్టుతో పాకిస్థాన్‌ (Pakistan)లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. ఇమ్రాన్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలకు పాల్పడిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇస్లాబామాద్‌ హైకోర్టు (Islamabad High Court) వద్ద మంగళవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చూసిన ఓ మాజీ మంత్రి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు లోపలికి పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ నేత ఇమ్రాన్‌ ఖాన్‌ను గతవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రాంగణంలో పాక్‌ రేంజర్లు బలవంతంగా అరెస్టు చేయడం తీవ్ర అల్లర్లకు దారితీసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరిగాయి. దీంతో పీటీఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌ మాజీ మంత్రి, పీటీఐ పార్టీ సీనియర్‌ నేత ఫవాద్‌ చౌధరీ (Fawad Chaudhry) కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై ఆయన ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఫవాద్‌ను నేడు పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చగా.. న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ క్రమంలోనే ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చిన ఫవాద్‌ (Fawad Chaudhry) తన వాహనం ఎక్కి బయల్దేరారు. అయితే పోలీసులు ఆయన కారును అడ్డగించి.. మరో కేసులో అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఫవాద్‌ కారు నుంచి వేగంగా దిగి కోర్టు లోపలికి పరుగులు పెట్టారు. బెయిల్‌ ఇచ్చినా తనను మళ్లీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన జడ్జీ.. మరో పిటిషన్‌ దాఖలు చేయాలని ఆయనకు సూచించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను పీటీఐ (PTI) పార్టీ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఆ వీడియోలో ఫవాద్‌ పరిగెత్తి కిందపడిపోగా.. లాయర్లు ఆయనకు సాయం చేసి కోర్టు లోపలికి తీసుకెళ్లారు. ఫవాద్‌ (Fawad Chaudhry)కు బెయిల్ మంజూరు చేసినా.. పోలీసులు ఆయనను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారని పీటీఐ ఆరోపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇమ్రాన్‌ఖాన్‌ హయాంలో ఫవాద్‌ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వ్యవహరించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని