Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!

పాకిస్థాన్(Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ దేశానికి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కూడా లేదు. దీనిపై రక్షణ శాఖ మంత్రి స్పందించారు.

Published : 26 Mar 2023 01:32 IST

ఇస్లామాబాద్‌: పొరుగుదేశం పాకిస్థాన్‌(Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకూ నిధులు లేవు. ఇక ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తాజాగా ఇదే అంశంపై అక్కడి ప్రభుత్వానికి ప్రశ్న ఎదురైంది. దీనిపై పాక్‌ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్థిక శాఖ వద్ద నిధులు లేవు’ అని వెల్లడించారు.

‘ప్రస్తుతం పాక్‌ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. దేశం ఎన్నో సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంది. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ సమయంలో పాక్(Pakistan) వాటిని భరించే స్థితిలో లేదు. నేతలు, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి అందరికి ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్రస్తుతమున్న మార్గం. ఆ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాలి’ అంటూ రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మార్గంలో ఉన్న అతిపెద్ద అవరోధం ఇమ్రాన్‌ ఖాన్‌ అని వ్యాఖ్యానించారు. ‘ఆయన రాజకీయాలను ఆటలాగా చూస్తున్నారు. ఏమైనా చేసి గెలవడమే ముఖ్యమనుకుంటున్నారు. కానీ అలా రాజకీయాలు నడవవు.  అందరితో మమేకమై ముందుకు సాగాల్సి ఉంటుంది’ అని వెల్లడించారు.

తన హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ఇమ్రాన్(Imran Khan) చేసిన వ్యాఖ్యలు అబద్ధమని రక్షణశాఖ మంత్రి ఖవాజా మండిపడ్డారు. ఆయన ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఇమ్రాన్ రోజూ ఏదో ఒక సంక్షోభం సృష్టిస్తున్నారని.. అయితే ప్రభుత్వం వాటిని ఎదుర్కొంటోందని, త్వరలో ఈ సంక్షోభాలు ముగిసిపోతాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు