Pakistan: టెర్రరిస్టులు దొరక్క.. బిస్కెట్లు తినేసి వెళ్లిపోయారు..!

పాకిస్థాన్‌(Pakistan)లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనిఉంది.

Updated : 20 May 2023 16:09 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) ఇంట్లో టెర్రరిస్టులు నక్కారంటూ ఇటీవల పంజాబ్ మంత్రి ఒకరు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా శుక్రవారం పోలీసు బృందం ఇమ్రాన్‌ ఇంట్లో సోదాలు నిర్వహించింది. మాజీ ప్రధానితో చర్చలు జరిపింది. ఇమ్రాన్‌ చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ ఇఫ్తికార్‌ గుమాన్‌ ఈ సోదాలపై వ్యంగ్యంగా స్పందించారు. అధికారులకు ఎవరూ దొరక్క.. బిస్కెట్లు తినేసి వెళ్లిపోయారని చెప్పారు. ‘ఇక్కడ ఏమీ లేదని వారికి అర్థమై ఉంటుందని భావిస్తున్నా. వారికి ఇక్కడ తాగడానికి నీరు, బిస్కెట్లు మాత్రమే లభించాయి. మీ ముందే వారికి ఇంటి తలుపులు తెరిచి ఉంచాం. ఇక్కడ ఏం దొరికిందో మీరిప్పుడు వారిని అడిగి తెలుసుకోండి’ అని మీడియా ఎదుట వ్యాఖ్యలు చేశారు.  

మే 9న ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan)అరెస్టు, తదనంతర పరిణామాల్లో భారీస్థాయిలో ఆందోళనకారులు సైనిక ఆస్తులపై దాడి చేశారు. ఇందులో చాలా మంది ఇమ్రాన్‌ ఇంట్లో దాక్కొన్నారని బుధవారం పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వం వ్యాఖ్యలు చేసింది. ఇదే విషయంపై మాట్లాడిన పంజాబ్‌ ఆపద్ధర్మ సమాచార మంత్రి ఆమిర్‌ మీర్‌ మాట్లాడుతూ.. లాహోర్‌లోని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంటిలో 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు దాక్కున్నారన్నారు. దీనిపై నిఘా సంస్థల నుంచి తమకు సమాచారం ఉందన్న ఆయన.. వారందర్నీ 24 గంటల్లో తమకు అప్పగించాలని ఇమ్రాన్‌ ఖాన్‌కు అల్టిమేటం జారీచేశారు. గురువారం మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం అధికారుల బృందం సోదాలు జరిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని