Afghanistan: అమెరికాకు సాయం చేస్తోంది పాకిస్థానే!

తమ దేశంలోకి ప్రవేశించేందుకు అమెరికన్‌ డ్రోన్లకు పాకిస్థాన్‌(Pakistan) తన గగనతల సాయం అందిస్తోందని అఫ్గానిస్థాన్‌(Afghanistan) రక్షణశాఖ మంత్రి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఆరోపించారు...

Published : 29 Aug 2022 01:35 IST

అఫ్గాన్‌ రక్షణ మంత్రి ఆరోపణలు

కాబుల్‌: తమ దేశంలోకి ప్రవేశించేందుకు అమెరికన్‌ డ్రోన్లకు పాకిస్థాన్‌(Pakistan) తన గగనతల సాయం అందిస్తోందని అఫ్గానిస్థాన్‌(Afghanistan) రక్షణశాఖ మంత్రి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఆరోపించారు. ఈ చొరబాట్లను అఫ్గాన్‌పై అగ్రరాజ్య యుద్ధం కొనసాగింపు చర్యలుగా అభివర్ణించారు. అఫ్గాన్‌లో తలదాచుకున్న అల్‌ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీని డ్రోన్‌ దాడిలో అంతమొందించినట్టు అమెరికా(America) గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ముజాహిద్‌ అమెరికాతో పాటు పాక్‌పై విమర్శలకు దిగారు. ఇప్పుడు కూడా అమెరికా డ్రోన్లు కాబుల్‌ మీదుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయని చెప్పారు.

డ్రోన్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్నకు ముజాహిద్‌ బదులిస్తూ.. ‘పాక్‌ గగనతలాన్ని వినియోగించి అక్కడినుంచి అఫ్గాన్‌లోకి ప్రవేశిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది’ అని తెలిపారు. పాక్‌ తన గగనతలాన్ని అఫ్గాన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాక్‌ సైన్యం స్పందించాల్సి ఉంది. ఇటీవల జవహరీపై డ్రోన్‌ దాడి సందర్భంగానూ ఈ తరహా ఆరోపణలు రాగా.. పాక్‌ తిరస్కరించింది. మరోవైపు అఫ్గాన్‌లో అమెరికా తన డ్రోన్‌లను మోహరించడం.. తమ దేశం, గగనతలంపై దాడిగా భావిస్తున్నట్లు ముజాహిద్ పేర్కొన్నారు. ఈ చట్టవిరుద్ధ చర్యలను మానుకోవాలన్నారు.

జవహరీని తుదముట్టించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటనపై తమ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ముజాహిద్ తెలిపారు. జవహరీ అఫ్గాన్‌లో ఉంటున్నట్లు, ఆయన మరణించినట్లు తాలిబన్లు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. ఇదిలా ఉండగా.. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటినుంచి అఫ్గాన్‌, పాక్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్గాన్‌లో ఆశ్రయం పొందుతున్న మిలిటెంట్ గ్రూపులు తరచూ తమ భూభాగంపై దాడులు చేస్తున్నాయని పాక్‌ ఆరోపిస్తుండగా.. తాలిబన్లు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో తూర్పు అఫ్గాన్‌లో పాక్‌ వైమానిక దాడుల కారణంగా.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని