Imran Khan: భారత్‌పై ప్రశంసలు కురిపించిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని..!

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌ను మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు.

Published : 22 Apr 2022 13:40 IST

భారత విదేశీ విధానమే ఉత్తమమన్న ఇమ్రాన్‌ ఖాన్‌

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌ను మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు. భారత్‌ అనుసరిస్తోన్న విదేశీ విధానం వారి ప్రజల శ్రేయస్సు కోసమేనంటూ కొనియాడారు. పాకిస్థాన్‌కు మాత్రం ఇటువంటి విధానం లేదన్న ఆయన.. ప్రజలకోసం కాకుండా కొందరి స్వప్రయోజనాల కోసమేనంటూ సొంత దేశ విధానాన్ని విమర్శించారు. లాహోర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన అంతర్జాతీయ వేదికపై భారత్‌ అనుసరిస్తోన్న వైఖరిపై ఈ విధంగా మాట్లాడారు.

‘ఓవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూనే.. మరోవైపు రష్యా నుంచి భారత్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటోంది. వారి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌ ఆ నిర్ణయాలు తీసుకుంటోంది. కానీ, మన విదేశీ విధానం మాత్రం ప్రజల ప్రయోజనాలకు చాలా దూరంగా ఉంది’ అంటూ పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సొంత దేశంపైనే విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రష్యా పర్యటనను సమర్థించుకున్న ఆయన.. దేశంలో పెరుగుతోన్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లోనే వెళ్లానని అన్నారు. ముఖ్యంగా ఆయిల్‌పై 30శాతం రాయితీ రష్యా ఇస్తోన్న విషయాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ గుర్తుచేశారు. ఇక తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్థానిక నాయకత్వంతో కలిసి విదేశీ శక్తులు కుట్ర పన్నాయంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి ఆరోపణలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న వేళ పలు విషయాల్లో భారత్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రధానిగా ఉన్న సమయం (మార్చి నెలలో)లోనూ ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై ప్రశంసలు గుప్పించారు. ముఖ్యంగా భారత్‌ అనుసరిస్తోన్న విదేశీ విధానం స్వతంత్రమైనదని.. వారి ప్రజల ప్రయోజనాల కోసమేనంటూ అంగీకరించారు. అమెరికాతో మైత్రి కొనసాగిస్తోన్న భారత్‌ క్వాడ్‌లోనూ భాగస్వామిగా ఉందన్నారు. అంతేకాకుండా తటస్థ వైఖరి అవలంబిస్తూనే ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకోవడాన్ని ప్రస్తావించారు. తాజాగా మరోసారి భారత్‌ విదేశీ విధానంపై ఇమ్రాన్‌ పొగడ్తలు గుప్పించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు