Pakistan: బిలావల్‌ నోట మళ్లీ అవాకులు, చెవాకులు

కశ్మీర్‌ అంశాన్ని ఐరాస ఎజెండాలోకి తీసుకొచ్చే విషయంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయని పాకిస్థాన్‌ వాపోయింది. ఈ విషయంలో భారత్‌ అడ్డుపడుతోందని పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ అక్కసు వెళ్లగక్కారు.

Updated : 11 Mar 2023 16:57 IST

న్యూయార్క్‌: ఐరాస(UN) వేదికలపై పాకిస్థాన్‌(Pakistan) ప్రతిసారి కశ్మీర్ అంశాన్ని(Kashmir Issue) లేవనెత్తుతుంది. సమావేశంలో చర్చిస్తున్న అంశం, ఎజెండాతో సంబంధం లేకుండా దీనిపై అనవసర వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఇదే విషయమై పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ(Bilawal Bhutto) తాజాగా భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఐరాసలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా భారత్‌ అడ్డుపడుతోందన్నారు. ఈ క్రమంలోనే ‘కశ్మీర్‌’ అంశాన్ని ఐరాస ఎజెండా(UN Agenda)లోకి తీసుకొచ్చే విషయంలో పాక్‌కు తీవ్ర ఒడుదొడుకులు(Uphill Task) ఎదురవుతున్నాయని వాపోయారు.

‘ఐరాస వేదికలపై కశ్మీర్ సమస్య ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా.. పొరుగు దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. ఇది వివాదాస్పద భూభాగం కాదని, ఐరాసలో చర్చించాల్సిన వివాదం కాదని చాటేందుకు యత్నిస్తాయి’ అని బిలావల్‌ వ్యాఖ్యానించారు. పాలస్తీనా, కశ్మీర్‌ పరిస్థితులను పోల్చుతూ.. ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. కశ్మీర్‌, పాలస్తీనాల పరిస్థితి ఒకటేనని.. ఈ రెండు సమస్యలనూ ఐరాస ఇప్పటివరకు పరిష్కరించలేదన్నారు. భారత్‌ను అభివర్ణించే క్రమంలో.. మిత్ర దేశం, పొరుగు దేశం అంటూ బిలావల్‌ తడబాటుకు గురికావడం గమనార్హం.

జమ్మూ- కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం భారత్‌, పాక్‌ల మధ్య ‘కశ్మీర్‌’ వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఎత్తిచూపి అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాక్‌ గతంలోనూ పలుమార్లు ప్రయత్నించి భంగపాటుకు గురైంది. జమ్మూ- కశ్మీర్‌, లద్దాఖ్‌లు పూర్తిగా భారత్‌లో అంతర్భాగమేనని, వాటిపై ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ ఇదివరకే దాయాదికి గట్టిగా చెప్పింది. ఉగ్రవాదం, శత్రుత్వం లేని వాతావరణంలో ఇస్లామాబాద్‌తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని