Published : 11 Mar 2023 01:43 IST

Pakistan: భారత్‌కు వెళ్తే భవిష్యత్తులో అడుగుపెట్టినట్లుంది: పాకిస్థానీ నిపుణుడు

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోన్న పాకిస్థాన్‌లో (Pakistan) ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని అక్కడి ప్రభుత్వంపై మండిపడుతోన్న పాక్‌ పౌరులు.. మాకు మోదీ కావాలంటూ కోరుకుంటున్న వీడియోలు సోషల్‌ మీడియాలో ఇటీవల చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్‌లో పర్యటించిన పాకిస్థానీ విదేశీ విధాన నిపుణుడు ఉజైర్‌ యూనస్‌ .. భారత్‌కి వెళ్తే భవిష్యత్తులో అడుగుపెట్టినట్లుందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో డిజిటల్‌ విప్లవంతోపాటు అక్కడి ప్రజలు శక్తితో నిండిపోయారన్న ఆయన.. పాకిస్థాన్‌లో మాత్రం రాజకీయాల కోసం విద్వేషంతో కూడిన అబద్ధాలను ఇక్కడి పౌరులకు నూరిపోస్తున్నారని అన్నారు.

పాకిస్థాన్‌ విదేశీ విధాన నిపుణుడు ఉజైర్‌ యూనస్‌ అట్లాంటిక్‌ కౌన్సిల్‌లోని దక్షిణాసియా కేంద్రంలో పాకిస్థాన్‌ విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ప్రైవేటు ఛానల్‌లో ‘ది పాకిస్థాన్‌ ఎక్స్‌పీరియన్స్‌’ పేరుతో వచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌లో ఇటీవల తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించిన అనుభవాలను వివరించారు. భారత్‌లో డిజిటల్‌ విప్లవం, మతసామరస్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన.. భారత్‌ ప్రజల్లో శక్తి దాగుంది అని ప్రశంసించారు.

‘భారతీయులు ఎంతో శక్తితో నిండిపోయారు. వారిలో పాజిటివ్‌ పవనాలు వెదజల్లుతున్నాయి. ఇది మా సమయం అనే భావన కనిపిస్తోంది. దేశంలో మౌలిక సదుపాయాల పెట్టుబడులతోపాటు ఆర్థికవ్యవస్థ డిజిటలీకరణకు చేస్తోన్న కృషి ఈ సానుకూల దృక్పథానికి కారణం. పాన్‌షాప్‌, బేకరి, రోడ్డుమీద చిన్నపాటి దుకాణాల్లోనూ ఎక్కడా నగదు చెల్లించే అవసరం లేదు. ఎక్కడ చూసినా డిజిటల్‌ చెల్లింపులే. వ్యాపారస్థులు కూడా తేలికగా విక్రయాలు సాగిస్తున్నారు. పాకిస్థాన్‌లో 5జీ నెట్‌వర్క్‌ లేదు. భారత్‌లో మాత్రం జియో లాంటి సంస్థలు సేవలు అందిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనూ జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు, యూపీఐ, మొబైల్‌ ఫోన్లు  ఉండటం ఆశ్చర్యం కలిగించాయి. మనదగ్గర (పాకిస్థాన్‌లో) డిజిటల్‌ ఐడీ కార్డులు, పాస్‌పోర్టులు ఉన్నాయి. కానీ, అవి పేరుకే’ అని యూనస్‌ పేర్కొన్నారు. ఇవన్నీ చూసిన మీకు ఒక రాష్ట్రాన్ని భవిష్యత్తులో చూసివచ్చినట్లు అనిపించిందా అని పాడ్‌కాస్ట్‌ నిర్వాహకుడు చమత్కరించగా.. అవును అనే విధంగా నవ్వుతూ అంగీకరించారు.

‘రాజ్‌కోట్‌లోని మా పూర్వీకుల గ్రామాన్ని సందర్శించాను. మూడు వేల జనాభా ఉన్న ప్రాంతంలోనూ ఇంటర్నెట్‌ 4జీ సేవలు అందుతున్నాయి. మా పూర్వీకుల సమాధులున్న ప్రదేశాన్ని చూడమని నాన్న చెప్పారు. వాటి పక్కనే ఉన్న పూల దుకాణంలోనూ క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపుల సౌలభ్యం ఉంది’ అని భారత్‌లోని డిజిటల్‌ చెల్లింపుల తీరును వెల్లడించారు. ఇక పాకిస్థాన్‌లో విపరీతంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం గురించి వివరించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డులు, బ్యాంకు అకౌంట్లు, యూపీఐలతో అనుసంధానం వంటి వివరాలను పోల్చిన ఆయన.. పాకిస్థాన్‌ ఎంతో వెనకబడిన విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts