Musharraf: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ కన్నుమూత!

ంపాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు (Parvez Musharraf) ముషారఫ్‌ కన్నుమూసినట్లు వార్తలొస్తున్నాయి. దుబాయ్‌లోని ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

Updated : 05 Feb 2023 13:39 IST

దుబాయ్‌: పాకిస్థాన్‌ (Pakistan) మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ (Parvez Musharraf)(79) కన్నుమూసినట్లు ఆ దేశ వార్తాసంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని అమెరికన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ముషారఫ్‌ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు పాకిస్థాన్‌కు చెందిన ‘జియో న్యూస్‌’ వెల్లడించింది.

దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న దిల్లీలో జన్మించిన ముషారఫ్‌.. దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.  ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఆ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకొనేందుకు తన పదవికి రాజీనామా చేశారు. పాక్‌ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేసిన ముషారఫ్‌.. 1999లో నవాజ్‌ షరీఫ్‌ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత పాక్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కార్గిల్‌ యుద్ధానికి ముషారఫ్‌ ప్రధాన కారకుడు. 2016 నుంచి ఆయన దుబాయిలోనే ఆశ్రయం పొందుతున్నారు. 

అమైలాయిడోసిస్‌ (Amyloidosis) అనే జబ్బుతో బాధపడుతున్న ముషారఫ్‌ గతకొంత కాలంగా దుబాయిలోనే చికిత్స పొందుతున్నారు. కొన్ని వారాల క్రితం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినట్లు పాక్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో తన చివరి రోజుల్లో పాక్‌లో గడపాలని ముషారఫ్‌ ఆశించినట్లు కుటుంబ సభ్యులను ఉటంకిస్తూ పలుసార్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. త్వరలోనే ఆయన తిరిగి పాక్‌కు రానున్నారని గత ఏడాది ప్రచారం కూడా జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని