Pakistan: ప్రతీకారం తీర్చుకోం.. ఎవ్వర్నీ జైలుకు పంపించం.. కానీ..!

కొత్త ప్రభుత్వంలో రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రతిపక్ష నేత షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు.

Updated : 10 Apr 2022 17:17 IST

ప్రతిపక్ష నేత షెహబాజ్‌ షరీఫ్‌ పరోక్ష హెచ్చరిక

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన అవిశ్వాస ఓటింగ్‌లో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌ తదుపరి ప్రధానిగా ముస్లింలీగ్‌-నవాజ్‌ పార్టీ అధినేత షెహబాజ్‌ షరీఫ్‌ (నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు) ఆ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశప్రజలనుద్దేశించి ట్వీట్‌ చేసిన షెహబాజ్‌.. తీవ్ర సంక్షోభం నుంచి పాకిస్థాన్‌తోపాటు పార్లమెంట్‌ విముక్తి పొందిందని అన్నారు. అయితే, కొత్త ప్రభుత్వంలో రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవన్న ఆయన.. చట్టం తనపని తాను చేసుకుంటుందని పరోక్షంగా హెచ్చరించారు.

‘మేం ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోం. ఎవ్వరికీ అన్యాయం చేయం. ఎవ్వర్నీ జైలులో పెట్టం. చట్టం తనపని తాను చేసుకుపోతుంది’ అని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ జైలుకు వెళ్లడం తప్పదని వస్తోన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

రేపే తదుపరి ప్రధాని ఎంపిక..

మొత్తం 342 మంది సభ్యులున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో 174 సభ్యుల మద్దతుతో ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించాయి. దీంతో నూతన ప్రధానిని ఎన్నుకునేందుకు పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ సోమవారం (ఏప్రిల్‌ 11) మధ్యాహ్నం 2గంటలకు సమావేశం కానుంది. కొత్త ప్రధాని ఎవరనే విషయమై ఇప్పటికే కాస్త స్పష్టత వచ్చింది. ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌ షరీఫ్‌ను ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. మరోవైపు పాక్‌ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ మిగిలిపోయారు. అయితే, ఓటమిని ముందే ఊహించిన ఇమ్రాన్‌.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరుగుతున్న సమయంలోనే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని