Pakistan: పాక్‌కు మరో అవమానం.. ఆ దేశ విమానం మలేసియాలో సీజ్‌..!

అప్పుల్లో ఉన్న పాకిస్థాన్‌కు మరో అవమానం ఎదురైంది. లీజు బకాయిలు చెల్లించడంలేదని ఆ దేశానికి చెందిన ప్యాసింజర్‌ విమానాన్ని మలేసియాలో అధికారులు సీజ్‌ చేశారు. 

Published : 31 May 2023 11:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌(Pakistan)కు మరో అవమానకర పరిస్థతి ఎదురైంది. ఆ దేశ విమానయాన సంస్థ పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన బోయింగ్‌ 777 విమానాన్ని మలేసియా అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. ఈ విమానాన్ని లీజుపై మలేసియా నుంచి పీఐఏ తీసుకొంది. కానీ, లీజు బకాయి 4 మిలియన్‌ డాలర్లకు చేరడంతో మంగళవారం ఈ విమానాన్ని కోర్టు ఆదేశాల మేరకు కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీజ్‌ చేశారు.  వాస్తవానికి లీజ్‌ విషయంలో వివాదం కూడా ఉంది. ఈ విమానం తనదేనని ఎయిర్‌ క్రాఫ్ట్‌ లీజింగ్‌ కంపెనీ వాదిస్తుండగా.. పీఐఏ(PIA) మాత్రం విమానం ఇంజిన్లలో ఒకటి మాత్రమే లీజింగ్‌ కంపెనీకి చెందుతుందని పేర్కొంది. దీంతోపాటు తాము కేవలం 1.8 మిలియన్‌ డాలర్లు మాత్రమే బకాయి ఉండగా.. దానిని కూడా ఇటీవల చెల్లించినట్లు పీఐఏ ప్రతినిధి హఫీజ్‌ ఖాన్‌ చెబుతున్నారు. 

ఈ విమానాన్ని 2021లో కూడా ఒక సారి మలేసియా అధికారులు లీజ్‌ విషయమై సీజ్‌ చేశారు. కానీ, ఆ తర్వాత బకాయిల చెల్లింపులపై పాకిస్థాన్‌ దౌత్యపరమైన హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. దీంతో అప్పట్లో 173 మంది ప్రయాణికులు, సిబ్బందితో విమానం పాక్‌కు తిరిగి వెళ్లింది. తాజాగా విమానాన్ని సీజ్‌ నుంచి విడిపించడానికి కౌలాలంపుర్‌లోని న్యాయసహాయ బృందాలతో పాక్‌ అధికారులు చర్చలు మొదలుపెట్టినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని