Imran Khan: నేను పారిపోను.. చివరి శ్వాస వరకు నా దేశంలోనే: ఇమ్రాన్‌ ఖాన్‌

పాకిస్థాన్‌(Pakistan)లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాను దేశం విడిచిపారిపోనని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) అన్నారు. 

Published : 18 May 2023 14:24 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌(Pakistan) విపత్తు వైపు వెళ్తోందని, దేశం విచ్ఛిన్నం కావొచ్చని మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) హెచ్చరించారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. ఈ రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికలు నిర్వహించడమే మార్గమన్నారు. అలాగే తాను దేశం విడిచిపారిపోయే ప్రసక్తే లేదని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. 

‘పరారై లండన్‌లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా..? దేశంలో వ్యవస్థలు, పాక్‌ ఆర్మీకి వస్తోన్న చెడ్డపేరు గురించి వారికేమైనా ఆలోచన ఉందా..? దేశం విపత్తు వైపు వెళ్తోంది. అందుకే ఎన్నికలు నిర్వహించి, దేశాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని అన్నారు. అలాగే ఆర్మీపై చేసిన విమర్శల గురించి స్పందించారు. ‘నేను ఆర్మీని విమర్శించడమంటే.. నా పిల్లలను మందలించినట్టే’ అని వ్యాఖ్యానించారు. తాజా సర్వేలో 70 శాతం మంది ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తేలిందని చెప్పారు.  

ఇదిలా ఉంటే.. ఇమ్రాన్‌ మరోసారి అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు ఉన్నారని, తనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇదే విషయంపై మాట్లాడిన పంజాబ్‌ ఆపద్ధర్మ సమాచార మంత్రి ఆమిర్‌ మీర్‌ మాట్లాడుతూ.. లాహోర్‌లోని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) ఇంటిలో 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు దాక్కున్నారన్నారు. దీనిపై తమకు నిఘా సంస్థల నుంచి సమాచారం ఉందన్న ఆయన.. వారందర్నీ 24 గంటల్లో తమకు అప్పగించాలని ఇమ్రాన్‌ ఖాన్‌కు హెచ్చరిక జారీచేశారు. 24 గంటల వరకు ఇమ్రాన్‌ ఇంటి వద్ద ఎలాంటి పోలీసు చర్య చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయి. తర్వాత తమ ప్రణాళికలు అమలు చేస్తామని చెప్పారు.

ఇమ్రాన్‌ మద్దతుదారులకు సైన్యం హెచ్చరిక..

మే 9న ఇమ్రాన్‌ అరెస్టు తర్వాత దేశంలో విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్మీకి  చెందిన భవనాలు, కార్యాలయాలపై ఇమ్రాన్‌ మద్దతుదారులు దాడికి దిగారు. దీనిని ఆర్మీ(Pak Army) సీరియస్‌గా తీసుకుంది. అమరవీరుల స్మారకాలను అగౌరవపరిచే చర్యలను ఏ మాత్రం అనుమతించమని వార్నింగ్ ఇచ్చింది. అయితే దేశంలో వివిధ ప్రాంతాలతోపాటు సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు తనతోపాటు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఇమ్రాన్ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని