Pakistan: పాక్‌ జాతీయ అసెంబ్లీ రద్దు.. ఆపద్ధర్మ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌!

ప్రధాని చేసిన సూచన మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రకటించారు.

Updated : 03 Apr 2022 19:43 IST

90 రోజుల్లోనే పాకిస్థాన్‌లో ఎన్నికలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతుందనుకున్న వేళ అక్కడ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం ఓటింగ్‌ను తిరస్కరించారు. ఇదే సమయంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని చేసిన సూచన మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రకటించారు. జాతీయ అసెంబ్లీ రద్దు అయినప్పటికీ పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ కొనసాగనున్నారు. అయితే, తాజా పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి.

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్లాన్‌-బీ

ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ సభకు హాజరుకాలేదు. ముందస్తు వ్యూహం ‘ప్లాన్‌-బీ’తో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీతో భేటీ అయ్యారు. అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులను అధ్యక్షుడికి వివరించిన ఇమ్రాన్‌, జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరినట్లు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇమ్రాన్‌ వెల్లడించారు. అందుకు అనుగుణంగానే జాతీయ అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రకటించారు. దీంతో 90 రోజుల్లోనే పాకిస్థాన్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.

సుప్రీం కోర్టుకు ప్రతిపక్షాలు..

జాతీయ అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరగకుండా చేసిన ఇమ్రాన్‌ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందన్నారు. పాకిస్థాన్‌ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో భాగంగా అన్ని వ్యవస్థల తలుపులు తడుతామన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్న ఆయన.. ఈ కేసును ఈరోజే విచారించాలని కోరుతామని వివరించారు. ఈ విషయంలో విపక్ష పార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నాయని  జర్దారీ స్పష్టం చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని