Pakistan New PM: పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా ‘షెహబాజ్‌ షరీఫ్‌’ ఎన్నిక..!

పాకిస్థాన్‌ నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ (70) ఎన్నికయ్యారు.

Published : 11 Apr 2022 17:20 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ (70) ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షెహబాజ్‌కు పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. మరోవైపు పీటీఐ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మెహమ్ముద్‌ ఖురేషీ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రధానమంత్రిగా షెహబాజ్‌కు మార్గం సుగమమైంది.

పాకిస్థాన్‌ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి జాతీయ అసెంబ్లీ నేడు మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఇందుకు ఇతర పార్టీల సభ్యులందరూ హాజరైనప్పటికీ ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ సభ్యులు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పీటీఐ పార్టీ నేతలంతా మూకుమ్మడి రాజీనామా చేసి, ప్రధాని ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దొంగలతో కలిసి జాతీయ అసెంబ్లీలో కూర్చోలేమంటూ పీటీఐ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉంటే, మనీ లాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షెహబాజ్‌ షరీఫ్‌తోపాటు ఆయన కుమారుడికి పాకిస్థాన్‌ న్యాయస్థానంలో ఊరట లభించింది. న్యాయస్థానానికి హాజరుతోపాటు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ను పొడగించిన న్యాయస్థానం.. ఈ కేసును ఏప్రిల్‌ 27కు వాయిదా వేసింది. దీంతో పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌కు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని