Pakistan: పాక్‌లో దారుణ పరిస్థితులు.. ప్లాస్టిక్‌ కవర్లలో వంటగ్యాస్‌ నిల్వ..!

ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పాకిస్థాన్‌.. సబ్సిడీ అందించే నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. ఈ క్రమంలో ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్‌ ప్రజలు.. వంటగ్యాస్‌ను ప్లాస్టిక్‌ కవర్లలో నింపి నిల్వ చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Published : 03 Jan 2023 01:24 IST

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ (Pakistan).. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను అందించలేకపోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత విధిస్తోన్న పాక్‌ ప్రభుత్వం.. నిత్యావసర వస్తువుల ధరలనూ అదుపు చేయలేకపోతోంది. ఇటువంటి సమయంలో క్రమంగా పెరుగుతోన్న ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు అక్కడ ప్రజలు వంటగ్యాస్‌(Cooking Gas)ను ప్లాస్టిక్‌ కవర్లలో నిల్వ చేసుకుంటుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

తీవ్ర ద్రవ్యోల్బణంతోపాటు పెట్రోలియం, గ్యాస్‌ నిల్వలు తగ్గిపోవడం, పతనమవుతోన్న కరెన్సీ విలువ వంటి అంశాలు పాకిస్థాన్‌ను వెంటాడుతున్నాయి. దీంతో సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అక్కడ అనేక ప్రాంతాలను వంటగ్యాస్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా ఖైబర్‌ పఖ్తూంఖ్వాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడి ప్రజలు వంటగ్యాస్‌ను ప్లాస్టిక్‌ కవర్లలో నిల్వచేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. భారీ సైజులో ఉన్న తెల్లటి ప్లాస్టిక్‌ బ్యాగుల్లో వంట గ్యాస్‌ను నింపి.. తీసుకువెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన రీతిలో వీటిని ఉపయోగిస్తున్నారని వస్తోన్న వార్తలపై స్పందించిన అధికారులు.. ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగంపై ఆంక్షలు విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ఖైబర్‌ పఖ్తూంఖ్వాలోని కరక్‌ జిల్లా ప్రజలు ఇప్పటికే వంటగ్యాస్‌కు దూరంగా ఉన్నారట. ఇక్కడి హంగూ నగర ప్రజలు గత రెండేళ్లుగా గ్యాస్‌ కనెక్షన్‌ లేకుండానే జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని