‘నా డ్యూటీ అయిపోయింది.. విధులకు రాలేను’.. షాకిచ్చిన పైలట్‌!

విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసిన ఓ పైలట్‌ ఆ తర్వాత మళ్లీ విధులు నిర్వహించేందుకు ససేమిరా అన్నాడు. తన డ్యూటీ టైం ముగిసిందని......

Published : 22 Jan 2022 01:31 IST

ఇస్లామాబాద్‌: విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసిన ఓ పైలట్‌ ఆ తర్వాత మళ్లీ విధులు నిర్వహించేందుకు ససేమిరా అన్నాడు. తన డ్యూటీ టైం ముగిసిందని, వెంటనే విధులు చేపట్టలేనని తేల్చి చెప్పాడు. దీంతో విమానంలోనే గంటలపాటు ఉన్న ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కు చెందిన పీకే-9754 విమానం గత ఆదివారం రియాద్‌ నుంచి పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పాక్‌ పైలట్‌ విమాన్నాన్ని సౌదీ అరేబియాలోని దమ్మమ్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశాడు. అయితే తిరిగి విధులు నిర్వహించేందుకు ఆ పైలట్‌ నిరాకరించాడు. తన షిఫ్ట్‌ సమయం ముగిసిందని, ఇప్పుడే విధులు చేపట్టలేనని స్పష్టం చేశాడు.

అయితే అప్పటికే విమానంలో గంటలపాటు ఎదురుచూసిన ప్రయాణికులు.. ఈ ఆలస్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విమానం ఎగిరేంతవరకు ప్రయాణికులకు ఓ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ‘పైలట్‌కు విశ్రాంతి అవసరం. ఈ అంశంపై విమాన భద్రత ఆధారపడి ఉంటుంది. ప్రయాణికులందరూ ఇస్లామాబాద్‌కు చేరుకునేవరకు వారికి హోటళ్లలో వసతి కల్పించాం’ అని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి స్థానిక మీడియాతో పేర్కొన్నారు. కొద్ది గంటల తర్వాత విమానం అక్కడినుంచి బయలుదేరి ఇస్లామాబాద్‌కు చేరినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని