Pakistan: ఇమ్రాన్‌ ఖాన్‌ ఇన్నింగ్స్‌ చివరిలో సైన్యం గుగ్లీలు..!

పాక్‌లో ఒక ప్రధాని పదవీకాలం మొత్తం కొనసాగడమన్నది ఆ దేశ చరిత్రలోనే లేదు..! ఇప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ చరిత్రను తిరగరాస్తానని చెబుతున్నారు. ‘నేను చివరి బంతి వరకు ఆడతాను’ అని భరోసాగా చెబుతున్నారు.

Published : 01 Apr 2022 01:29 IST

 పతనం అంచున పాక్‌ ప్రభుత్వం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పాకిస్థాన్‌లో ఒక ప్రధాని పదవీకాలం మొత్తం కొనసాగడమన్నది ఆ దేశ చరిత్రలోనే లేదు..! ఇప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ చరిత్రను తిరగరాస్తానని చెబుతున్నారు. ‘నేను చివరి బంతి వరకు ఆడతాను’ అని భరోసాగా చెబుతున్నారు. కానీ, పాక్‌ సైన్యం ఆయన్ను సాగనంపేందుకు సైలెంట్‌గా వ్యూహం పన్నింది. ఫలితంగా అక్కడి రాజకీయ పరిస్థితి చూస్తే మాత్రం ఇమ్రాన్‌ గద్దె కిందకు నీళ్లు వచ్చాయని.. ఏ క్షణమైనా ఆయన ప్రభుత్వం పతనమైపోతుందని అర్థమవుతోంది. ‘‘దేశాలకు సైన్యాలు ఉంటాయి.. కానీ, పాకిస్థాన్‌లో సైన్యానికే ఓ దేశం ఉంది’’ అనే నానుడిని నిజం చేసేలా ఉన్నాయి.

అసలు విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి..?

2018లో పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదు. ఆ సమయంలో సైన్యం, ఇంటర్‌సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ ఆశీస్సులు లభించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు లభించింది. ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా తన పదవీకాలం 2019 నవంబర్‌ 29తో ముగియనుండటంతో.. అనుభవం లేని కొత్త ప్రధాని ఉంటే పదవీకాలం పొడిగింపు తేలికవుతుందని భావించి ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతు ఇచ్చారు. కానీ, ఆర్మీ చీఫ్‌ పదవీకాలం పొడిగింపు విషయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ విముఖంగా వ్యవహరించారనే ఆరోపణలొచ్చాయి. పొడిగింపు కోసం ఖాన్‌ విడుదల చేసిన ఆదేశాలను ఆ దేశ సుప్రీం కోర్టు 2019 నవంబర్‌ 28న కొట్టేసింది. కాకపోతే ఆర్మీచీఫ్‌కు ఆరు నెలలు పొడిగింపు ఇచ్చి.. ఈ లోపు అక్కడి నేషనల్‌ అసెంబ్లీలో చట్టసవరణలు చేయాలని సూచించింది. అయిష్టంగానే ఇమ్రాన్‌ ప్రభుత్వం ఈ పనిచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్మీచీఫ్‌ బజ్వా-పాక్‌ప్రధాని ఇమ్రాన్‌ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. 

* ఆ తర్వాత తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన సమయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగానే వారికి మద్దతు ఇచ్చారు. ఇది పశ్చిమ దేశాల్లో పాక్‌పై ఆగ్రహాన్ని పెంచింది. మరోవైపు అమెరికా వంటి దేశాలను ఇమ్రాన్‌ బహిరంగంగానే విమర్శించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పటి వరకు ఇమ్రాన్‌ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాక్‌ సైన్యం ఇమ్రాన్‌పై గుర్రుగా ఉండటానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. 

* పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ బదిలీ వ్యవహారం ఆర్మీతో ఇమ్రాన్‌ విభేదాలను తీవ్రం చేసింది. ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఫయాజ్‌ ఒకరు. పాక్‌ సైన్యంలోని బలోచ్‌ రెజ్‌మెంట్‌ నుంచి వచ్చారు. 2018 పాక్‌లో ఎన్నికలు జరిగిన సమయంలో ఫయాజ్‌ హమీద్‌ డిప్యూటీ ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్నారు. ఆయన అంతర్గత భద్రతకు బాధ్యత వహిస్తారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులను నేరుగానే బెదిరించారు. వారిని ఇమ్రాన్‌ ఖాన్‌ ఏర్పాటు చేసిన పీటీఐ పార్టీలో చేరేలా ఒత్తిడి చేశారు. నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌ఎన్‌ పార్టీ ఇచ్చిన టికెట్లను తీసుకోవద్దని అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు పీఎంఎల్‌ఎన్‌ ఓట్లలో చీలిక తెచ్చేందుకు పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్‌లో ఓ పార్టీని పెట్టించారు. ఒక దశలో పాక్‌లోని ఎలక్షన్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ ఆర్‌టీఎస్‌ను కూడా కుప్పకూల్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019లో ఐఎస్‌ఐ చీఫ్‌గా ఆయన్ను నియమించారు. 2021లో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తర్వాత ఫయాజ్‌ హమీద్‌ నేరుగా కాబుల్‌ వెళ్లారు. అక్కడ సెరీనా హోటల్‌లో తాలిబన్ల ఆతిథ్యం పొందుతున్న చిత్రాలు సంచలనం సృష్టించాయి. తాలిబన్ల వెనుక పాక్‌ సైన్యం ఉందన్న వాదనలను ఇది బలపర్చింది. ఆర్మీచీఫ్‌ బజ్వా ఈ వ్యహారంపై విచారణ జరిపి.. ఫయాజ్‌ను పెషావర్‌ కోర్‌కు బదిలీ చేశారు. ఫయాజ్‌ స్థానంలో నదీమ్‌ అంజూమ్‌ అనే అధికారిని నియమించారు. ఫయాజ్‌ బదిలీని అడ్డుకొనేందుకు ఇమ్రాన్‌ నేరుగా ఆర్మీచీఫ్‌తోనే విభేదాలు పెట్టుకొన్నారు. వాస్తవానికి ఫయాజ్‌ ఆర్మీచీఫ్‌గా నియమించాలన్నది ఇమ్రాన్‌ ఆలోచన.  

ఈ ఘటన బజ్వాను ఆలోచనలో పడేసింది. ఈ ఏడాది నవంబర్‌లో బజ్వా పదవీకాలం ముగియనుంది. ఇమ్రాన్‌ పదవిలో ఉంటే పొడిగింపు సమయంలో మరోసారి సమస్యలు సృష్టిస్తారని ఆయన భావిస్తున్నారు. మరోపక్క ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయ వేదికలపై సైన్యాన్ని విమర్శించడం కూడా మొదలుపెట్టారు. దీనికి తోడు పాక్‌ ఆర్థిక స్థితి నానాటికీ దిగజారిపోతోంది. తాజాగా దేశంలో వచ్చిన రాజకీయ తుపానులో పాక్‌ సైన్యం తటస్థంగా ఉంటుందని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఇమ్రాన్‌ తప్పుబట్టి.. సైన్యాన్ని జంతువులతో పోల్చారు. ఈ ఘటనతో సైన్యానికి ఇమ్రాన్‌కు మధ్య సత్సంబంధాలు లేవని తేలిపోయింది. ఇమ్రాన్‌కు మద్దతు ఇచ్చిన కీలక పార్టీలైన ఎంక్యూఎం-పీ, బీఏపీలు ప్రతిపక్షాల పంచన చేరాయి. దీంతో ఆయనకు మద్దతు ఓట్ల సంఖ్య మేజిక్‌ ఫిగర్‌ 172 కంటే తక్కువ అయింది. దీంతో ఖాన్‌ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయమైపోయింది. 

కసబ్‌ పాకిస్థానీనే అని అంగీకరించిన ఇమ్రాన్‌ మంత్రి..

ప్రభుత్వం కూలుతోందన్న కంగారులో ఇమ్రాన్‌ ఖాన్‌ మంత్రి వర్గ సహచరులు సైన్యాన్ని, ప్రతిపక్షాలను ఇరకాటంలోకి నెట్టే పనులు చేస్తున్నారు. తాజాగా పాక్‌ ఇంటీరియర్‌ మంత్రి షేక్‌ రషీద్‌ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈ క్రమంలో భారత్‌ ఎన్నో ఏళ్లగా చెబుతున్న వాదనను బలపర్చేలా ప్రకటన చేశారు. ముంబయి దాడుల్లో భారత్‌ పోలీసులకు దొరికిన అజ్మల్‌ కసబ్‌ పాకిస్థానీనే అని అంగీకరించారు. అసలు పాకిస్థానీనే అన్న విషయాన్ని మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారత్‌కు వెల్లడించారని ఆరోపించారు. కసబ్‌ చిరునామాతో సహా భారత్‌కు అందించారని.. ఇది తప్పు అని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే అని సవాల్‌ చేశారు. ఇన్నేళ్లు కసబ్‌ ఎవరో తెలియదంటూ బుకాయించిన పాక్‌కు రషీద్‌ ప్రకటనతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 

ఏమి జరగబోతోంది..?

ప్రతిపక్షాలు మార్చి మొదట్లో ఇమ్రాన్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. సోమవారం దానిని నేషనల్‌ అసెంబ్లీ ముందుకు తెచ్చాయి. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత నుంచి ఏడు రోజుల లోపు ఓటింగ్‌ జరుగుతుంది. ఈ  అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఇమ్రాన్‌ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇతర పార్టీల నుంచి కొత్త ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవచ్చు. పాక్‌ నేషనల్‌ అసెంబ్లీకి ఆగస్టు 2023 వరకు గడువు ఉంది. అప్పటి వరకు కొత్త ప్రధాని పాలించవచ్చు.. లేదా తాజాగా ఎన్నికలను నిర్వహించాలని కోరవచ్చు. నవాజ్ షరీఫ్‌ సోదరుడు షాబాజ్‌ షరీఫ్‌ పేరు తర్వాతి ప్రధాని రేసులో ముందుంది. 

ఎవరీ షాబాజ్‌ షరీఫ్‌..?

పాకిస్థానీ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తమ్ముడే షాబాజ్‌ షరీఫ్‌. 1988లో రాజకీయల్లోకి వచ్చిన ఆయన పంజాబ్‌ సీఎంగా మూడు సార్లు బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారు. భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తిచేయడంలో దిట్టగా పేరుంది. చైనా, టర్కీలతో విదేశీ వ్యవహారాలను నడపడంలో షాబాజ్‌కు మంచి పేరుంది. 

* 1999లో సైనిక తిరుగుబాటు జరిగిన సమయంలో షాబాజ్‌ కుటుంబాన్ని సౌదీలో ప్రవాసానికి పంపారు. 2007లో తిరిగి పాకిస్థాన్‌కు వచ్చాడు. 

* 2018 ఎన్నికల్లో పీఎంఎల్‌(ఎన్‌) ఓడిపోయింది. ఆ సమయంలో ఆయన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇమ్రాన్‌ఖాన్‌ నామినేట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో పీఎంఎల్‌(ఎన్‌)కు 111 స్థానాలు వచ్చాయి. 

హత్య ఆరోపణలు..

పలు వివాదాల్లో  కూడా షాబాజ్‌ పేరు వచ్చింది. ఆయన ప్రవాసంలో ఉన్న సమయంలో ఐదుగురు ఆధ్యాత్మిక విద్యార్థులను చంపమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007లో ఆయన పాక్‌కు తిరిగి వచ్చినా.. ఈ ఆరోపణల కారణంగా ఏడాదిపాటు ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదు. ఇక 2019లో నేషనల్‌ అకౌంటబులిటీ బ్యూరో షాబాజ్‌కు చెందిన 28 ఆస్తులను జప్తు చేసి.. మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసింది.గతేడాది ఏప్రిల్‌లో ఆయన్ను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని