Imran Khan: బిల్‌గేట్స్‌తో పాక్‌ ప్రధాని లంచ్‌.. ఐఎస్‌ఐ చీఫ్‌ను దాచిపెట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌..!

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఇటీవల తొలిసారిగా పాకిస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. గేట్స్‌కు ఆతిథ్యమిచ్చారు. ఈ

Published : 20 Feb 2022 01:52 IST

ఇస్లామాబాద్‌: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఇటీవల తొలిసారిగా పాకిస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. గేట్స్‌కు ఆతిథ్యమిచ్చారు. ఈ విందుకు పాకిస్థాన్‌ కేబినెట్‌ మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ ఫొటోలను ఇమ్రాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ, ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. పాక్‌ ప్రధాని షేర్‌ చేసిన ఫొటోలో ఓ వ్యక్తిని మార్ఫ్‌ చేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ నదీమ్ అంజున్‌. దీంతో ఐఎస్‌ఐ చీఫ్‌ను దాచిపెట్టారంటూ ఇమ్రాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఫిబ్రవరి 17న ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ఫొటోలను షేర్‌ చేశారు. ఆయన పోస్ట్‌ చేసిన వెంటనే అందులో ఒక వ్యక్తిని ఫొటోషాప్‌ సాయంతో మార్ఫ్‌ చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. ఆ ఫొటోలో బిల్‌గేట్స్‌, ఇమ్రాన్ ఖాన్‌ సహా కార్యక్రమంలో పాల్గొన్న అందరూ ఆ వ్యక్తి వైపే చూస్తున్నట్లుగా ఉండటంతో ఆ వ్యక్తి ఎవరై ఉంటారా అన్న ఆసక్తి మొదలైంది. ఎందుకు మార్ఫ్‌ చేశారా అన్న గందరగోళం తలెత్తింది. అయితే ఆయన ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ నదీమ్‌ అని ఈ సమావేశంతో సంబంధమున్న వ్యక్తులు కొందరు పాక్‌ న్యూస్‌ ఏజెన్సీ ‘ది కరెంట్‌’కు తెలిపారట. 

పాక్‌ ప్రభుత్వం, ప్రధానులు ఐఎస్‌ఐ చేతుల్లో కీలుబొమ్మలే అని చెప్పేందుకు మరో ఉదాహరణే ఇది అని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎందుకంటే.. అధికారిక సమావేశాల్లో తన ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఐఎస్‌ఐ చీఫ్‌.. ప్రబుత్వానికి చెప్పారట. అందుకే తాజా ఫొటోలో ఆయన ముఖాన్ని మార్ఫ్‌ చేసినట్లు తెలుస్తోంది. 

నదీమ్‌ అంజుమ్‌ గతేడాది అక్టోబరులో ఐఎస్‌ఐ నూతన చీఫ్‌గా నియమితులయ్యాడు. అంతకుముందు ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్న ఫయాజ్‌ హమీద్‌, పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వాకు మధ్య వర్గ పోరు మొదలవడంతో హమీద్‌ను పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో నదీమ్‌ అంజుమ్‌ నియమితులయ్యారు. అయితే నదీమ్‌ నియామకాన్ని తొలుత ఆర్మీ మీడియా వింగ్‌ ప్రకటించగా.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య అంతర్గత పోరు మొదలైనట్లు వార్తలు వినిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని