Pak on Kashmir: పాకిస్థాన్‌ ప్రధాని నోట.. శాంతి మాట

జమ్మూకశ్మీర్‌ వివాదంతో ఇతర అంశాల్లో భారత్‌తో శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు  పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు.

Published : 20 Aug 2022 01:38 IST

భారత్‌తో శాంతియుత సంబంధాలు కోరుకుంటున్నామన్న షెహబాజ్‌ షరీఫ్‌

దిల్లీ: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ (Shahbaz Sharif) కశ్మీర్‌ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. జమ్మూకశ్మీర్‌ అంశంలోనూ శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా వచ్చిన నీల్‌ హాక్సిన్‌తో భేటీ సందర్భంగా పాక్‌ ప్రధాని భారత్‌ అంశాన్ని ప్రస్తావించారు. అయితే, భారత విదేశాంగ విధానంపై మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) పొగడ్తలు గుప్పిస్తోన్న తరుణంలో షెహబాజ్‌ షరీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) నియమాలకు అనుగుణంగా జమ్మూకశ్మీర్‌ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నాం. కశ్మీరీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం ఎంతో అవసరం’ అని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నట్లు పాక్‌ మీడియా పేర్కొంది. దీనికి సులభతర పరిష్కారం లభించేందుకు అంతర్జాతీయ సమాజం పాత్ర అవసరమని నొక్కిచెప్పారు. దక్షిణాసియాలో ఈ సమస్య చూపే ప్రభావాన్ని కూడా ఆస్ట్రేలియా హైకమిషనర్‌తో షెహబాజ్‌ షరీఫ్‌ ప్రస్తావించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, పశుపోషణ వంటి రంగాల్లో ఆస్ట్రేలియాతో సహకారాన్ని మరింత విస్తరించేందుకు పాకిస్థాన్‌ నిబద్ధతతో ఉందని పాక్‌ప్రధాని చెప్పినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది.

ఇదిలా ఉంటే, భారత్‌ విదేశాంగ విధానంపై పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వరుసగా ప్రశంసలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేస్తోన్న భారత్‌ను విమర్శించడం సరికాదంటూ పాశ్చాత్య దేశాల తీరుపై మండిపడ్డారు. అంతేకాదు, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూనే రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ క్రమంలో పశ్చిమ దేశాల డిమాండ్లకు భారత్‌ తలొగ్గలేదంటూ పొగడ్తలు గుప్పించిన ఇమ్రాన్‌ ఖాన్‌.. పాకిస్థాన్‌ ప్రభుత్వం మాత్రం అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందంటూ విమర్శించారు. అంతకు ముందు తాను ప్రధాని పదవి నుంచి తప్పుకునేందుకు అమెరికాతోపాటు కొన్ని విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని